సెంచరీలు సరే టీమ్ స్పిరిట్ ఏమైపాయె? టీం ఇండియాలో స్పిరిట్ కొరవడిందా? ఆస్ట్రేలియాలో ఘోర పరాజయం.. నితీష్‌కుమార్ రెడ్డి మెరుపులు తప్ప చెప్పుకోవడానికేదైనా వుందా? మనోడు సత్తా చాటాడు. మరి స్టారాధిస్టార్ క్రికెటర్ల ప్లాప్ షోకు కారణాలేంటి? బోర్డ్ -గవాస్కర్ ట్రోఫీ ఆసీసు కైవసం చేసుకుంది. రికార్డుల రారాజులున్న టీమ్ ఇండియాకు ఇంత పేలవ పరిస్థితి ఎందుకని? ఆసీస్‌లోనే కాదు అంతకు ముందు హోమ్‌టౌన్‌లో కివిస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ అదే తీరు. మనోళ్లు ఫెయిల్.. సిరీస్ న్యూజీలాండ్ పరం. బౌండరీలు.. సిక్సర్లు బాదుతూ సెంచరీలు కొట్టే హేమాహేమాలున్నా సరే టీం ఇండియా ఎందుకని పరాజయపథంలో వుంది. కారణం.. కోచ్‌కు ప్లేయర్లకు మధ్య గ్యాప్ ఏర్పడ్డమా? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైఖరినా? గంభీర్ మోనార్క్‌లా వ్యవహరించారా? ఇలా ఎన్నెన్నో చర్చలతో రచ్చ పబ్లిక్ డొమైన్‌లోకి రానే వచ్చింది.
సీనియర్లు కొత్త వాళ్లతో కలిసిపోవడం లేదని.. స్టార్ ప్లేయర్స్ తమకు ఫలనా హోటల్‌లోనే బస ఏర్పాటు చేయాలని పట్టుపట్టారని.. కొందరు ఆటగాళ్ల గొంతెమ్మ డిమాండ్లు, హెడ్ వెయిట్ వైఖరితో హెడ్ కోచ్ గంభీర్‌కు చిర్రెత్తిందని.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఫ్యామిలీ మెంబర్స్‌ను అనుమతించకపోవడం వల్లే సీనియర్లకు కోపం తెప్పించిందని.. ఇలాంటి టీమ్‌ను ఇస్తారా? అని చీఫ్‌సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు, గంభీర్‌కు మధ్య అంతర్యుద్ధం రాజుకుందని ఇలా రకరకాల ముచ్చట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.. కొడుతూనే ఉన్నాయి.
టీమ్ ఇండియాలో సఖ్యత కొరవడిందనేది ఉహాగానాలా.. ఉతుత్తి ప్రచారాలా.. నిజంగానే అవన్నీ నిజమా. నిప్పులేనిదే పొగరాదు. ఆస్ట్రేలియా టూర్‌లో చెత్త ఆట.. చిత్తు ఓటమిపై బీసీసీఐ రివ్యూ నిర్వహించింది. దాంతో టీం ఇండియాలో స్పిరిట్ కొరవడిందని.. లుకలుకలు ఉన్నాయనే క్లారిటీ వచ్చేసిందనేది విశ్లేషకుల మాట. కొందరు సీనియర్లు కావాలని తనకు సహకరించడంలేదని గంభీర్ వాపోయినట్టు తెలుస్తోంది. ఎట్ ది సేమ్ టైమ్ గంభీర్ వ్యవహార శైలిపై సీనియర్లు గుర్రుగా వున్నారట. ఇవన్నీ కాదన్నట్టు మరో రకమైన చర్చ రచ్చగా మారింది. ప్రతిభ వున్న సరే అంబటి రాయుడిలాంటి వాళ్లకు టీమ్‌లో చోటు దక్కకపోవడానికి కారణం కొందరు సీనియర్లు, వాళ్లకు వంతపాడే సెలక్టేర్లే అనే విమర్శలు ఉండనే ఉన్నాయి. కానీ టీమ్ ఇండియాలో లుకలుకలపై బీసీసీఐ ఎలాంటి కామెంట్ చేయలేదు. ఆల్ ఈజ్ వెల్ అని కవర్ డ్రైవ్ చేస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ–గంభీర్‌కు కొరకాని కొయ్యలుగా మారారా? టీమ్‌ను నడిపించడంలో గంభీర్ ఆశించినంత సక్సెస్ కాలేదా? తాజా పరిణామాల నేపథ్యంలో మార్పులు తప్పవని బీసీసీఐ అల్రెడీ వార్నింగ్ బెల్ కొట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఆధిపత్యం, మనస్పర్దతలు పక్కన పెట్టిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కలిసి కట్టుగా వుంటారా? ఛాంపియన్స్ ట్రోఫీ వరకు వెయిట్ చేసి ఆ తరువాత వేటు ప్రక్రియకు బీసీసీఐ సిద్ధం అవుతుందా? ఇలా ఎన్నెన్నో చర్చలు జరుగుతున్నాయి.