
తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవన్షీ కోసం బీసీసీఐ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవన్షీకి విదేశీ పర్యటనల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు అతని తల్లిదండ్రులను కూడా వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. యువ ఆటగాడి మానసిక సౌకర్యం, కుటుంబ మద్దతును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ వెల్లడించారు.
ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టుతో కలిసి శ్రీలంకలో ఉన్న వైభవ్, త్వరలో భారత సీనియర్ జట్టుతో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనున్నాడు. ఇప్పటివరకు తన వయసు వారితో కలిసి అండర్-19 స్థాయిలో ఆడిన అతడు, ఇప్పుడు సీనియర్ క్రికెటర్లతో ప్రయాణించనున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల సహకారం అవసరమని బీసీసీఐ భావించింది. ఈ నేపథ్యంలో అతని తండ్రి ఇప్పటికే శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భవిష్యత్తులో ఇంగ్లాండ్ పర్యటనకు కూడా తల్లిదండ్రులు వెళ్లాలనుకుంటే బీసీసీఐ పూర్తి సహకారం అందించనుంది.
వైభవ్ ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆడిన అతడు 16 మ్యాచ్‌లలో 776 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. 237.31 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడిన ఈ యువ ఆటగాడు ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అంతకుముందు అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో 175 పరుగులు చేసి భారత్‌కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతని అసాధారణ ప్రతిభను గుర్తించిన సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతడిని భారత టీ20 జట్టులోకి ఎంపిక చేసింది. ఈ ఎంపికతో వైభవ్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయసులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడి రికార్డును అధిగమించే దిశగా అడుగులు వేస్తున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి