
BCCI : టీమిండియా సీనియర్ స్టార్ ప్లేయర్‌లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ (అక్టోబర్ 19 నుంచి) ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ రోకో జోడి మళ్లీ కలిసి ఆడటం ఇదే తొలిసారి. అయితే, వన్డే కెప్టెన్సీని శుభ్‌మన్ గిల్‌కు అప్పగించిన తర్వాత, ఈ ఆస్ట్రేలియా సిరీసే రోహిత్, కోహ్లీకి ఆఖరి వన్డే సిరీస్ కాబోతోందని వార్తలు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఆస్ట్రేలియా సిరీస్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల చివరి సిరీస్ కాబోతోందనే వార్తలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పూర్తిగా తిరస్కరించారు. కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉండడం వల్ల తమకు ప్రయోజనకరమని ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇది చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. “రిటైర్మెంట్ ఎల్లప్పుడూ ఆటగాడి వ్యక్తిగత ఎంపిక, బోర్డు నిర్ణయం కాదు” అని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఇద్దరినీ తొలగించే ఆలోచనలు బీసీసీఐకి లేవని శుక్లా ప్రకటించారు.
విరాట్ కోహ్లీ, హిత్ శర్మ ఇప్పటికే టెస్ట్, టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వన్డే కెప్టెన్సీని కూడా రోహిత్ నుంచి తీసివేసి, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. ప్రస్తుతం రోహిత్ శర్మకు 38 ఏళ్లు. 2027 వన్డే ప్రపంచకప్ నాటికి ఆయన వయస్సు దాదాపు 40 ఏళ్లు అవుతుంది. ఈ కారణాల వల్లే ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వీరిద్దరిని వన్డే జట్టు నుంచి తప్పిస్తారనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే, రాజీవ్ శుక్లా దీనిని కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టి పారేశారు.
రాజీవ్ శుక్లా ప్రకటనతో బీసీసీఐకి ఈ దిగ్గజాలను తక్షణమే పక్కన పెట్టే ఆలోచన లేదని స్పష్టమైంది. “రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లు. వారిని జట్టులో ఉంచుకుని మేము ఆస్ట్రేలియాను ఓడించగలుగుతాం. ఇది వారి చివరి వన్డే సిరీస్ అని చెప్పడం పూర్తిగా తప్పు. వారు ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం” అని శుక్లా తెలిపారు. అయినప్పటికీ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఈ ప్రకటన చేసినప్పటికీ, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్ల ప్రదర్శన చాలా ముఖ్యం. ఒకవేళ కోహ్లీ, రోహిత్ ఈ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేస్తే, ఆ తర్వాత జరిగే సౌతాఫ్రికా సిరీస్‌కు వారిని సెలక్ట్ చేయడం అనుమానమేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈ ఆస్ట్రేలియా సిరీస్ వారి వన్డే భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..