
సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు 0-2 తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. గంభీర్ స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రెడ్ బాల్ కోచ్‌గా రావచ్చని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ ఊహాగానాలను బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి. గౌతమ్ గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తొలగించే ఉద్దేశం లేదని, ఆయనపై పూర్తి నమ్మకం ఉందని తెలిపాయి.
ఏడాది కంటే తక్కువ వ్యవధిలో భారత్ రెండోసారి స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయినప్పటికీ బీసీసీఐ గంభీర్‌కు మద్దతుగా నిలిచింది. ‘‘ప్రస్తుతానికి గౌతమ్ గంభీర్ స్థానంలో మేము ఎవరినీ నియమించడం లేదు. అతను జట్టును పునర్నిర్మిస్తున్నాడు. అతని ఒప్పందం 2027 ప్రపంచ కప్ వరకు కొనసాగుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ దశలో ఉన్నందున, గంభీర్‌కు పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశాయి. దక్షిణాఫ్రికా వైట్-బాల్ సిరీస్ ముగింపులో టీమ్ మేనేజ్‌మెంట్-సెలెక్టర్ల మధ్య సమావేశం ఉంటుందని, టెస్ట్ జట్టు ప్రదర్శనను మెరుగుపరచడానికి గంభీర్‌ను ఆయన వ్యూహాల గురించి అడుగుతారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా గౌతమ్ గంభీర్‌కు గట్టి మద్దతుగా నిలిచారు. కోచ్‌ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన విమర్శించారు. గవాస్కర్ మాట్లాడుతూ.. ‘‘గంభీర్ ఒక కోచ్. కోచ్ జట్టును సిద్ధం చేయగలడు. కానీ ఆటగాళ్లు మైదానంలో ఆడాలి. ఇప్పుడు అతన్ని జవాబుదారీగా ఉంచాలని అడుగుతున్న వారికి నా ప్రశ్న ఏమిటంటే.. అతని నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడు ఏం చేశారు’’ అని ప్రశ్నించారు. జట్టు బాగా రాణించనప్పుడు మాత్రమే కోచ్‌ను అనడం కరెక్ట్ కాదని గవాస్కర్ గట్టిగా సమాధానం ఇచ్చారు.