Michael Vaughan Coments: బౌన్సర్లను రద్దు చేస్తే యువ క్రికెటర్లకు ఎంతో నష్టమని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ అభిప్రాయపడుతున్నాడు. పురుషుల క్రికెట్‌లో నేరుగా షార్ట్‌పిచ్ బంతులను ఎదుర్కొనేలా చేయడం బ్యాట్స్‌మెన్‌కు మంచిది కాదన్నాడు. ఇటీవల మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్.. ఆటగాళ్లకు బౌన్సర్లను అనుమతించాలా వద్దా అనే విషయంపై చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్నేషనల్ కంకషన్ అండ్ హెడ్ ఇంజురీ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ఇటీవల అండర్-18 ఆటగాళ్లకు బౌన్సర్లు వేయకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. అయితే దీనిని మైకెల్ వాన్ తీవ్రంగా ఖండిస్తున్నాడు.
ఇది మరో పనికిమాలిన ప్రతిపాదనగా అభివర్ణించాడు. పిల్లలకు ఇది మరింత ప్రమాదం. అత్యున్నత స్థాయిలో వారిని నేరుగా షార్ట్‌పిచ్ బంతులు ఎదుర్కోమంటే వాటిని ఆడటానికి సిద్ధంగా ఉండరు. జూనియర్ స్థాయిలో బౌలర్లు షార్ట్‌పిచ్ బంతులను తక్కువ ఎత్తులో వేస్తారు. బౌన్సర్లు వేసే అంత శక్తి సామర్థ్యాలు వారికి ఉండవు. యువ క్రికెటర్లు షార్ట్ బాల్స్ ఆడటం కూడా నేర్చుకోవాలి. ఒకవేళ జూనియర్ స్థాయిలో బౌన్సర్లను రద్దు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తొలగించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.