BAN vs NZ: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం టీ 20 ఫార్మాట్‌లో సందడి చేస్తోంది. టీ 20 సిరీస్‌లో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన బంగ్లా జట్టు.. ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు చెమటలు పట్టించారు. ఢాకాలో నేడు మొదలైన టీ 20 సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ దాడితో కివీస్‌ను 60 పరుగులకే ఆల్ ఔట్ చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. బంగ్లా టీంలో ముస్తిఫర్ రహీమ్ 16, మహ్మదుల్లాస్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మరో వికెట్ పడకుండా విజయం సాధించారు.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ 20 ఓవర్లు కూడా ఆడలేకపోయారు. ముస్తాఫిజుర్ రహమాన్ (3), షకీబ్ అల్ హసన్, నసూమ్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు. న్యూజిలాండ్ టీంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే రెండంకెల మార్కును దాటగలిగారు. ఈ సిరీస్ కోసం, న్యూజిలాండ్ టీం 10 మంది స్టార్ ఆటగాళ్లు లేకుండానే బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది.
పురుషుల టీ 20 క్రికెట్‌లో న్యూజిలాండ్ అత్యల్ప స్కోరు 60 పరుగులుగా నమోదైంది. పురుషుల టీ 20 క్రికెట్‌లో ఇది రెండో అత్యల్ప స్కోరు. న్యూజిలాండ్ జట్టు రెండోసారి టీ 20 క్రికెట్‌లో 60 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు 2014 లో ఛటోగ్రామ్‌లో శ్రీలంకపై 60 పరుగులు చేసింది. విశేషం ఏమిటంటే.. న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కూడా టీ 20 ఫార్మాట్‌లో అత్యల్ప స్కోరు 60 పరుగులే.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడవ బంతి నుంచే న్యూజిలాండ్ వికెట్ల పతనం మొదలైంది. అరవింగ్ రచిన్ రవీంద్ర ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్లు కూడా ఒకరి తర్వాత ఒకరు వెనుదిరిగారు. విల్ యంగ్ (5), టామ్ బ్లండెల్ (2), కోలిన్ డి గ్రాండ్‌హోమ్ (1) రెండంకెల సంఖ్యను కూడా తాకలేకపోయారు. దీంతో న్యూజిలాండ్ జట్టు తొమ్మిది పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. అలాగే చివరి 6 వికెట్లను కూడా కేవలం 17 పరుగులకే కోల్పోవడం గమనార్హం. కెప్టెన్ టామ్ లాథమ్ (18), హెన్రీ నికోల్స్ (18) ఐదో వికెట్ తరపున 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ, మహ్మద్ సైఫుద్దీన్ లాథమ్‌ను అవుట్ చేయడంతో న్యూజిలాండ్‌కు మరోసారి షాకిచ్చాడు. చివరికి న్యూజిలాండ్ టీం 60 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కేవలం మూడు ఫోర్లు మాత్రమే ఉన్నాయి.
బంగ్లాదేశ్ తరఫున ముస్తాఫిజుర్ రహమాన్ 13 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. నసూమ్ అహ్మద్ ఐదు పరుగులకు రెండు వికెట్లు, షకీబ్ 10 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశారు. అలాగే మొహమ్మద్ సైఫుద్దీన్ ఏడు పరుగులకు రెండు వికెట్లు తీశాడు.
IND vs ENG: నాలుగో టెస్ట్‌లో భారత్‌తో తలపడే జోరూట్ సేన ఇదే.. భారీ మార్పులతో ఓవల్ బరిలోకి!