ముస్తాఫిజుర్ విడుదలతో బంగ్లా సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో ఆడబోమంటూ బెదిరింపులు..?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ 2026 నుంచి విడుదల చేయాలని కోల్ కతా నైట్ రైడర్స్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) శ్రీలంకతో కలిసి భారతదేశం నిర్వహించనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌ల వేదికల మార్పు కోసం ఐసీసీ చెంతకు చేరాలని ప్రయత్నిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ముస్తాఫిజుర్ విడుదలతో బంగ్లా సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో ఆడబోమంటూ బెదిరింపులు..?
T20 World Cup 2026

Updated on: Jan 04, 2026 | 11:08 AM

బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) శనివారం ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ వివాదం మరింత రాజుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐని ఇబ్బందుల్లో పెట్టేందుకు బంగ్లాదేశ్ పలు నిర్ణయాలు తసీుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ 2026 కాంట్రాక్ట్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలని బీసీసీఐ కోరడంతో, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మరో కీలక అడుగు వేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలని ఐసీసీ (ICC) ని కోరాలని నిర్ణయించుకుంది. షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ జట్టు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్ (ఫిబ్రవరి 7, 2026), ఇటలీ (ఫిబ్రవరి 9), ఇంగ్లాండ్ (ఫిబ్రవరి 14) తో పాటు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్‌ (ఫిబ్రవరి 17) తో ఆడాల్సి ఉంది.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశంలో వెల్లువెత్తిన నిరసనల కారణంగా, ముస్తాఫిజుర్‌ను భారత్‌లో ఆడనివ్వకూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ బోర్డు, భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వేదికలను మార్చాలని కోరింది.

ఇవి కూడా చదవండి

బీసీబీ (BCB) అధికారి ప్రకటన..

“ముస్తాఫిజుర్ విడుదల అనేది వారి అంతర్గత విషయం, దానిపై నేను వ్యాఖ్యానించలేను. కానీ ప్రపంచకప్ అనేది ఐసీసీ ఈవెంట్. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఐసీసీయే తుది నిర్ణయం తీసుకుంటుంది,” అని బీసీబీ అధికారి ఒకరు తెలిపారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ తమ దేశానికి రావడానికి నిరాకరించడంతో, పాకిస్తాన్ కూడా భారత్‌లో ఆడేందుకు ఇష్టపడటం లేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బీసీసీఐ వివరణ..

బంగ్లాదేశ్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగానే ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని కేకేఆర్ జట్టును కోరినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా తెలిపారు. అతనికి బదులుగా మరొక ఆటగాడిని ఎంచుకునేందుకు కేకేఆర్‌కు అనుమతినిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

ముస్తాఫిజుర్ ఐపీఎల్ ప్రయాణం..

30 ఏళ్ల ముస్తాఫిజుర్‌ను ఇటీవల జరిగిన మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 9.2 కోట్లకు ($1.1 మిలియన్) కొనుగోలు చేసింది. ఒక బంగ్లాదేశ్ ఆటగాడికి ఐపీఎల్ చరిత్రలో లభించిన అత్యధిక ధర ఇదే. గతంలో ఇతను ఐదు వేర్వేరు ఫ్రాంచైజీల తరపున ఆడాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అరంగేట్రం చేసి, ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా అందుకున్నాడు.

ముదురుతున్న దౌత్య వివాదాలు..

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన పాలనా మార్పుల తర్వాత హిందువులపై దాడులు పెరగడంతో భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల కారణంగానే భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్ పర్యటనను బీసీసీఐ ఇప్పటికే వాయిదా వేసింది. 2026 సెప్టెంబర్‌లో ఈ సిరీస్ జరుగుతుందని బీసీబీ క్యాలెండర్‌లో ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..