
Bangladesh Cricket : భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు క్రీడా మైదానంలోనూ సెగలు పుట్టిస్తున్నాయి. క్రికెట్ పరంగా బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. టీమిండియా దిగ్గజ బ్రాండ్లు బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకోవడమే కాకుండా, ఆ దేశంతో వ్యాపార సంబంధాలను కూడా తెంచుకుంటున్నాయి. దీనివల్ల బంగ్లాదేశ్ క్రికెటర్ల వ్యక్తిగత ఆదాయంతో పాటు ఆ దేశ స్పోర్ట్స్ ఇండస్ట్రీ కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది.
ప్రముఖ భారతీయ క్రీడా సామాగ్రి తయారీ సంస్థ SG(Sanspareils Greenlands) ఇప్పటికే బంగ్లాదేశ్ టాప్ ఆటగాళ్లతో తన ఒప్పందాలను నిలిపివేసింది. బంగ్లాదేశ్ ప్రస్తుత కెప్టెన్ లిట్టన్ దాస్, మోమినుల్ హక్ వంటి స్టార్ ప్లేయర్లకు ఈ సంస్థ బ్యాట్ స్పాన్సర్‌గా ఉండేది. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాంట్రాక్ట్ రెన్యూవల్స్‌ను SG పక్కన పెట్టేసింది. మరోవైపు, ప్రముఖ బ్రాండ్ సరీన్ స్పోర్ట్స్(SS) కూడా నలుగురైదుగురు బంగ్లాదేశ్ క్రికెటర్ల స్పాన్సర్‌షిప్ కాంట్రాక్టులను రద్దు చేసినట్లు సమాచారం.
కేవలం స్పాన్సర్‌షిప్ మాత్రమే కాకుండా, వ్యాపారపరంగా కూడా బంగ్లాదేశ్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటివరకు SS వంటి భారతీయ సంస్థలు తమ స్పోర్ట్స్ అపారెల్, ఇతర సామాగ్రిని బంగ్లాదేశ్‌లోని ఫ్యాక్టరీలలో తయారు చేయించేవి. అయితే, ప్రస్తుత అస్థిర పరిస్థితుల వల్ల భారతీయ సంస్థలు బంగ్లాదేశ్ నుండి తమ సప్లై లైన్లను పూర్తిగా నిలిపివేశాయి. గత ఆరు నెలలుగా SG కూడా తన ఉత్పత్తుల పంపిణీని ఆ దేశంలో ఆపేసింది. దీనివల్ల బంగ్లాదేశ్‌లోని స్థానిక ఫ్యాక్టరీలకు అందే ఆదాయం నిలిచిపోయింది.
ఈ గొడవ అంతా ఐపీఎల్ వేలంతో మొదలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ, బీసీసీఐ ఆదేశాల మేరకు అతడిని జట్టు నుండి తప్పించింది. దీనికి ప్రతిచర్యగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది. అంతేకాకుండా, 2026 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. ఈ పరిణామాలన్నీ భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ బంధాన్ని మరింత క్షీణింపజేశాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..