
Babar Azam : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ నుంచి పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం అర్థాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా సిడ్నీ సిక్సర్స్ జట్టు బాబర్‌ను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా సిడ్నీ సిక్సర్స్ జట్టు బాబర్ అనుభవాలను పంచుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఈ 37 సెకన్ల వీడియోనే ఇప్పుడు బాబర్ కొంపముంచింది. ఆ వీడియోలో బాబర్ మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటకు మధ్యలో ఆ.. ఆ..అంటూ తడబడటం నెటిజన్ల కంటికి చిక్కింది. ఒక యూజర్ అయితే లెక్కకట్టి మరీ “37 సెకన్లలో 85 సార్లు ఆ..ఆ..అని అన్నాడు” అంటూ పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
బాబర్ ఆజం ఇంగ్లీష్ మాట్లాడటంలో ఇబ్బంది పడటం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లలో ఆయన ప్రతిదానికీ డెఫినెట్లీ అనే పదాన్ని వాడటంపై విపరీతమైన మీమ్స్ వచ్చాయి. సరైన స్ట్రైక్ రేట్ లేక, ఇంగ్లీష్ రాక బాబర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో టార్గెట్ అవుతూనే ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఆయన మాటతీరు చూస్తుంటే, మాట్లాడటానికి పడుతున్న పాట్లు నవ్వు తెప్పిస్తున్నాయని అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు. ఆటలో ఎంత తోపు అయినా, కమ్యూనికేషన్ విషయంలో బాబర్ కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు బిగ్ బాష్ లీగ్‌లో బాబర్ ప్రదర్శన కూడా ఏమంత ఆశాజనకంగాలేదు. సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడిన 11 మ్యాచుల్లో కేవలం 202 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని సగటు 22.44 కాగా, స్ట్రైక్ రేట్ మరీ ఘోరంగా 103.06 గా ఉంది. టీ20 క్రికెట్‌లో ఇంత తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడటంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు కూడా పెదవి విరిచారు. ఒక ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులకే అవుట్ అవ్వడం అతని ఫామ్ ఎంత అధ్వాన్నంగా ఉందో చెబుతోంది. కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేసిన బాబర్, జట్టు విజయంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
37 sec video has 85 ‘Ah’ ‘Ah’ ‘Ah’ from Babar Azam 😂
– BTW, Babar Azam has played 85 dot balls in BBL 2025-26, that’s ‘Ah’ for every dot ball 😆pic.twitter.com/AKQP7dCa4s
— Richard Kettleborough (@RichKettle07) January 22, 2026
అంతర్జాతీయ కెరీర్‌లో బాబర్ ఆజంకు మంచి రికార్డులే ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన 61 టెస్టులు, 140 వన్డేలు, 136 టీ20లు ఆడి వేల సంఖ్యలో పరుగులు సాధించారు. కానీ, ఇటీవల కాలంలో ఆయన ఫామ్ పడిపోవడం, కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి రావడం వంటి పరిణామాలు ఆయన్ని మానసికంగా దెబ్బతీశాయి. మైదానంలో పరుగులు రాక, బయట మాటలు రాక బాబర్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ట్రోలింగ్ నుంచి బయటపడాలంటే ఆయన కేవలం బ్యాట్‌తోనే కాకుండా, తన కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా దృష్టి పెట్టాలని నెటిజన్లు ఉచిత సలహాలు ఇస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..