
Bob Simpson : క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆ దేశ మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్ కన్నుమూశారు. 89 సంవత్సరాల వయస్సులో ఆయన సిడ్నీలో తుదిశ్వాస విడిచారు. ఈ లెజెండరీ ఆటగాడి మరణంతో ఆస్ట్రేలియా క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రికెట్ సమాజంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగే మూడవ టీ20 మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లు తమ చేతికి నల్లటి బ్యాండ్ కట్టుకుని ఈ దిగ్గజానికి నివాళులు అర్పించనున్నారు.
బాబ్ సింప్సన్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులు నెలకొల్పారు. 1957 నుంచి 1978 మధ్య ఆస్ట్రేలియా తరపున 62 టెస్టులు, 2 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 10 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు సహా 4,869 పరుగులు చేశారు. అంతేకాకుండా, ఆయన ఒకే ఇన్నింగ్స్‌లో 311 పరుగుల ట్రిపుల్ సెంచరీ సాధించడం ఒక అరుదైన ఘనత. టెస్టుల్లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా సత్తా చాటి 71 వికెట్లు పడగొట్టారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆయన రికార్డులు ఇంకా అసాధారణం. 257 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 60 సెంచరీలు, 100 హాఫ్ సెంచరీలు సాధించి 21,029 పరుగులు చేశారు. బౌలింగ్‌లో 349 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండర్‌గా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.
ఒక ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్, కోచ్‌గా కూడా బాబ్ సింప్సన్ ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించారు. ఆయన 39 టెస్టులకు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరించారు. 1986 నుంచి 1996 వరకు పదేళ్ల పాటు ఆస్ట్రేలియా హెడ్ కోచ్‌గా జట్టును విజయపథంలో నడిపించారు. ఆయన కోచింగ్ హయాంలోనే ఆస్ట్రేలియా 1987లో వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అలాగే, 1989లో ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను, 1995లో వెస్టిండీస్‌లో వారిపై సిరీస్‌ను గెలిచి ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చాటింది.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, బాబ్ సింప్సన్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “బాబ్ సింప్సన్ ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఆయన కంటే ఎక్కువగా ఎవరూ సేవ చేయలేదు. ఒక కోచ్, ఆటగాడు, కామెంటేటర్, రచయిత, సెలెక్టర్, మెంటార్, జర్నలిస్టుగా ఆయన ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఉన్నత స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు” అని స్టీవ్ వా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా, క్రికెట్ ఆస్ట్రేలియా ఆయన పేరుతో బాబ్ సింప్సన్ అవార్డును కూడా ఏర్పాటు చేసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..