
Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ప్రారంభమైంది. ఈ ఎడిషన్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ దేశాలు పాల్గొంటున్నాయి. ట్రోఫీ కోసం పోరాటం ఉత్కంఠభరితంగా ఉండగా, ప్రైజ్ మనీ గురించి కూడా అభిమానులు అంతే ఆసక్తిగా ఉన్నారు.
విజేతకు రూ. 2.60 కోట్లు
నివేదికల ప్రకారం.. ఈసారి విజేత జట్టు రూ.2.60 కోట్లు ప్రైజ్ మనీగా గెలుచుకుంటుంది, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.1.30 కోట్లు లభిస్తాయి. ఐతే, ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఇంకా ఈ లెక్కలను అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, గత ఎడిషన్ల కంటే ప్రైజ్ మనీ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది (2024)లో విజేత జట్టుకు రూ. 1.5 కోట్లు లభించగా, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 82 లక్షలు దక్కాయి.
భారత్ అద్భుతమైన ఆరంభం
భారత జట్టు సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి తమ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కూడా 7 వికెట్ల తేడాతో సులభంగా గెలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌లు, ఇప్పటికే ఎనిమిది సార్లు ఆసియా కప్‌ను గెలిచిన భారత జట్టు మరోసారి బలమైన పోటీదారుగా కనిపిస్తోంది.
తదుపరి ఏమిటి?
భారత్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌ను దుబాయ్‌లోని షేక్ జాయెద్ స్టేడియంలో ఒమన్తో ఆడనుంది. వరుసగా రెండు విజయాలతో, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో చాలా నమ్మకంగా, సమతుల్యంగా కనిపిస్తోంది. ఈసారి కూడా టైటిల్ గెలుచుకుని, తమ ఛాంపియన్ షిప్‌ను నిలబెట్టుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..