IPL 2022: నేడే కొత్త జట్ల ప్రకటన.. పోటీలో అదానీ నుంచి మాంచెస్టర్ యునైటెడ్ వరకు.. ఐపీఎల్ 2022 ఎలా మారనుందో తెలుసా?

|

Oct 25, 2021 | 2:55 PM

BCCI: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు బీసీసీఐ నేడు ప్రకటించనుంది. దీంతో 2022 ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు ఒకదానితో ఒకటి తలపడనున్నాయి. ఐపీఎల్‌లో 10 జట్లు ఉండటం ఇదే మొదటిసారి కాదు.

IPL 2022: నేడే కొత్త జట్ల ప్రకటన.. పోటీలో అదానీ నుంచి మాంచెస్టర్ యునైటెడ్ వరకు.. ఐపీఎల్ 2022 ఎలా మారనుందో తెలుసా?
Ipl 2022 New Franchises
Follow us on

IPL 2022: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు బీసీసీఐ నేడు ప్రకటించనుంది. దీంతో 2022 ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు ఒకదానితో ఒకటి తలపడనున్నాయి. ఐపీఎల్‌లో 10 జట్లు ఉండటం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు 2011 లో ఐపీఎల్ మూడవ సీజన్‌లో 10 జట్లు పోటీలో నిలిచాయి. ఆ సమయంలో, కొచ్చి టస్కర్స్ కేరళ, పూణే వారియర్స్ అనే ఫ్రాంచైజీలు ఐపీఎల్‌లో సందడి చేశాయి. ఈసారి కొత్త టీమ్‌లు ఏ నగరానికి చెందినవి, వాటి యజమాని ఎవరు అనేది తేలనుంది.

కొత్త జట్లు ఏ నగరం నుంచి రావొచ్చు? ఎవరు పోటీలో ఉన్నారు? కొత్త జట్ల కోసం బీసీసీఐ ఎంత మొత్తానికి వేలం వేయాలని భావిస్తోంది? కొత్త జట్ల రాక ఐపీఎల్‌ని ఎలా ప్రభావితం చేస్తుంది? దీని వల్ల ఆటగాళ్లు ఎలా లాభపడతారు? వివరంగా తెలుసుకుందాం..

కొత్త జట్లు ఏ నగరం నుంచి రానున్నాయి?
ఐపీఎల్‌లో రెండు జట్ల కోసం దేశంలోని ఏవైనా రెండు నగరాల పేరు పెట్టనున్నారు. దీని కోసం 6 నగరాలు రేసులో ఉన్నాయి. బలమైన పోటీదారుగా అహ్మదాబాద్‌ నిలవనుంది. ఈ సంవత్సరం అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కూడా దీనికి పెద్ద కారణం. ఇందులో లక్ష మందికి పైగా ప్రేక్షకులు కూర్చోవచ్చు.

అహ్మదాబాద్ చాలా కాలంగా కొత్త జట్టు కోసం రేసులో ఉంది. 2010లో 10 జట్ల ఐపీఎల్ జరిగినప్పుడు కూడా అహ్మదాబాద్ రేసులో ఉంది. దీని కోసం వేలం కూడా వేయగా, పుణె, కొచ్చి ఫ్రాంచైజీలు బిడ్డింగ్‌ను గెలుచుకున్నాయి.

రెండో నగరంగా లక్నో పేరు ముందు వరుసలో ఉంది. దీని ద్వారా ఐపీఎల్‌ను అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రానికి తీసుకెళ్లాలని బీసీసీఐ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రెండు నగరాలు కాకుండా, కటక్, గౌహతి, ఇండోర్, ధర్మశాల నగరాల పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. కొన్ని నివేదికలలో రాంచీ నగరం కూడా పోటీదారుగా ఉందని తెలుస్తుంది.

కొత్త జట్ల కోసం పోటీలో ఎవరున్నారు?
మొత్తం 22 వ్యాపార సంస్థలు రెండు టీంలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీరంతా బిడ్డింగ్ పత్రాలను కొనుగోలు చేశారు. బిడ్డర్లలో అదానీ గ్రూప్, గ్లేజర్ కుటుంబం, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్, టొరెంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఆర్‌పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా గ్రూప్ యజమానులు, మాజీ మంత్రి నవీన్ జిందాల్ జిందాల్ స్టీల్, రోనీ స్క్రూవాలా, ముగ్గురు ప్రైవేట్ ఈక్విటీ భాగస్వాములు ఉన్నారు.

ఒక పెట్టుబడిదారుడు ఒకటి కంటే ఎక్కువ నగరాలకు బిడ్ చేయవచ్చు. అయితే, ఒకజట్టుకు మాత్రమే యాజమానిగా ఉంటాడు. బిడ్‌ల విజేతల నిర్ణయంతో రెండు నగరాల పేర్లను కూడా నేడు ప్రకటించనున్నారు.

విదేశీయులు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉందా?
బిడ్డింగ్ పార్టీ మొత్తం ఆస్తులు రూ.2.5 వేల కోట్లు లేదా గత మూడేళ్ల సగటు వ్యాపారం రూ.3 వేల కోట్లు ఉండాలని బీసీసీఐ టెండర్‌లో పేర్కొంది. ఇందులో టీమ్‌లను కొనుగోలు చేసేందుకు విదేశీ కంపెనీలకు కూడా అనుమతి లభించింది. మాంచెస్టర్ యునైటెడ్ యజమానుల విషయానికొస్తే, గ్లేజర్ కుటుంబం ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ద్వారా ఫారమ్‌లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

కొత్త జట్లపై భారత మాజీ ఆటగాడు ఆసక్తి కనబరుస్తున్నాడని కూడా చర్చ జరుగుతోంది. అతను భారత జట్టులో మాజీ స్టార్ ఆటగాడని, ప్రపంచ కప్ కూడా గెలుచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో సచిన్ టెండూల్కర్ లేదా మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు మాత్రం తెలియదు.

బీసీసీఐ ఎంత మొత్తానికి వేలం వేయాలని భావిస్తోంది?
కొత్త జట్ల కోసం బీసీసీఐ రూ. 2000 కోట్ల ప్రాథమిక ధరను నిర్ణయించింది. జట్లను చాలా ఎక్కువ మొత్తానికి వేలం వేస్తారని తెలుస్తోంది. ఈ జట్ల నుంచి బీసీసీఐకి రూ. 7 నుంచి రూ. 10 వేల కోట్లు రాబట్టవచ్చని అంచనా.

బీసీసీ రూ. 3 వేల కోట్ల టర్నోవర్ షరతు విధించిందా, మరి కంపెనీల మాటేంటి?
బీసీసీఐ అధికారుల మేరకు, గత మూడు సంవత్సరాలుగా బిడ్డింగ్ కంపెనీల టర్నోవర్ రూ .3,000 కోట్లు ఉండాలి. ఈ మొత్తం భారీగా ఉండవచ్చు. కానీ అది వేలం వేయడానికి ఆసక్తి ఉన్నవారికి కాదు. ఉదాహరణకు, అదానీ గ్రూప్ వెబ్‌సైట్ ప్రకారం, దాని మార్కెట్ క్యాప్ రూ. 9.2 లక్షల కోట్లు. అదే సమయంలో నవీన్ జిందాల్ కంపెనీ జిందాల్ స్టీల్ మార్కెట్ క్యాప్ రూ.4.12 వేల కోట్లు. ప్రత్యేక విషయం ఏమిటంటే, నవీన్ జిందాల్ సోదరుడు సజ్జన్ జిందాల్‌కు కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌లో వాటా ఉంది.

ఎవరు ప్రయోజనం పొందుతారు?
ప్రేక్షకుల గురించి మాట్లాడితే, మరిన్ని మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం ఉంది. రెండు జట్ల పెరుగుదలతో, ఐపీఎల్‌లో మ్యాచ్‌ల సంఖ్య 60 నుంచి 74 కి పెరుగుతుంది. ఆటగాళ్ల పరంగా మాట్లాడితే, రెండు జట్ల పెరుగుదలతో, కనీసం 45 నుండి 50 మంది కొత్త ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. వీరిలో 30 నుంచి 35 మంది భారత యువ ఆటగాళ్లు ఉండనున్నారు.

బ్రాడ్‌కాస్టర్ విషయానికి వస్తే, ఎక్కువ మ్యాచ్‌ల కారణంగా వారి ఆదాయం మరితం పెరగనుంది. ఈ కారణంగా, రాబోయే 5 సంవత్సరాలకు ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బీసీసీఐ రికార్డ్ డీల్‌ను అంచనా వేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2023 నుంచి 2027 వరకు 5 సంవత్సరాల పాటు ఈ లీగ్ ప్రసార హక్కులతో రూ. 35 నుంచి 40 వేల కోట్లు ఆదాయం పొందనుందని తెలుస్తోంది. 2018 నుంచి 2022 వరకు బీసీసీఐ ఈ హక్కులను స్టార్ ఇండియాకు రూ. 16,347.50 కోట్లకు విక్రయించింది.

IPLలో ఇంతకు ముందు జట్లు ఎప్పుడు పెరిగాయి?
2011 లో మొదటిసారిగా, రెండు జట్లను ఐపీఎల్‌లో చేర్చారు. కొచ్చి టస్కర్స్ కేరళ, పుణె వారియర్స్ ఐపీఎల్‌లో భాగమయ్యాయి. ఆ తరువాత ఏడాది టోర్నమెంట్‌లో జట్ల సంఖ్యను 10 నుంచి 9 జట్లకు తగ్గించారు. ఐపీఎల్ నుంచి కొచ్చి విడిపోయింది. IPL 2012, 2013లో 9 జట్లు ఉన్నాయి. ఆ తరువాత, పూణే వారియర్స్ 2014 లో ఐపీఎల్ నుంచి వైదొలిగింది. ఈ టోర్నమెంట్ మళ్లీ 8 జట్లే మిగిలాయి. 2016 లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా నిషేధించిన సంగతి తెలిసిందే. నిషేధం తర్వాత రెండు ఫ్రాంచైజీలకు బదులుగా రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్, గుజరాత్ లయన్స్ రెండు సీజన్‌లలో పాల్గొన్నాయి. చెన్నై, రాజస్థాన్‌లపై నిషేధం ఎత్తివేసిన వెంటనే పూణే, గుజరాత్ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాయి.

కొత్త జట్టు రాక ఐపీఎల్ ఫార్మాట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఐపీఎల్‌లో 10 జట్లు చేరడంతో లీగ్ రౌండ్‌లో ప్రతి జట్టు 7 ప్రత్యర్థి జట్లతో 14 మ్యాచ్‌లు ఆడనుంది. ప్రతీ జట్టు తమ గ్రూపులోని 4 ఇతర జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడతాయి. ఒక మ్యాచ్ వారి సొంత మైదానంలో, ఒక మ్యాచ్ ప్రత్యర్థి జట్టు మైదానంలో జరగనుంది. అంటే, వారి గ్రూపులో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇది కాకుండా, ఇతర గ్రూప్‌లోని 4 జట్లతో ఒక్కో మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంటుంది. మిగిలిన ఒక జట్టు రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం డ్రా ఉంటుంది. దీనిలో ఎవరు ఎప్పుడు, ఎవరితో ఆడనున్నారో పేర్కొంటారు. ఈ విధంగా లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. నాకౌట్ దశ ప్రస్తుత ఫార్మాట్‌లో మాత్రమే జరుగుతుంది. ఇందుకోసం ఎలిమినేటర్, క్వాలిఫయర్, ఫైనల్ అనే నాలుగు మ్యాచ్‌లు ఉంటాయి. అంటే టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Also Read: 34 బంతుల్లో విధ్వంసం సృష్టించాడు.. టెస్టు మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ.. ఎవరో తెలుసా.!

IPL 2022: రెండు కొత్త టీంలు.. పది బిడ్లు.. దుబాయ్‌లో మొదలైన ప్రక్రియ.. మరికొద్ది గంటల్లో నిర్ణయం