Anil Kumble Vs Virat Kohli: టీమిండియా క్యాంప్ నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా సంచలన వార్తలు బయటకు వస్తున్నాయి. మొదట విరాట్ కోహ్లీ టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు బాంబ్ పేల్చాడు. ప్రస్తుతం అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్‌గా ఎన్నికయ్యే అవకాశాలు జోరందుకున్నట్లు తెలుస్తోంది. రవిశాస్త్రి స్థానంలో అనిల్ కుంబ్లే టీమిండియాకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే టీమిండియా కోచ్ చైర్‌పై అనిల్ కుంబ్లే రెండవసారి ఎక్కనున్నాడు. టీమిండియా ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌ల పదవీకాలం టీ 20 వరల్డ్ కప్ తర్వాత ముగుస్తుంది. దీంతో బీసీసీఐ వీరి ప్లేస్‌లను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనిల్ కుంబ్లేను ప్రధాన కోచ్‌గా ఎన్నుకునేందుకు బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
2016లో తొలిసారి..
2016లో టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే నియమితులయ్యారు. కానీ, అతను కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా 2017 సంవత్సరంలో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మెంటార్‌గా ఎంఎస్ ధోనీని బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన వారం రోజుల తర్వాత విరాట్ కోహ్లీ టీ 20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
2017లో అనిల్ కుంబ్లే ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత రవిశాస్త్రి అతని స్థానంలో హెచ్ కోచ్‌గా జాయిన్ అయ్యారు. విరాట్ కోహ్లీ.. రవిశాస్త్రికి మద్దతు ఇచ్చాడు. అయితే ఇప్పుడు శాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లేను మరోసారి నియమించే ఆలోచనలో బిసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు గంగూలీ 2017 లో కూడా కుంబ్లేనే కోచ్‌గా ఉండాలని కోరుకున్నాడు. 2016 లో కుంబ్లే ప్రధాన కోచ్‌గా మారిన ప్రభావంతోనే టీమిండియా 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకుంది. కానీ, పాకిస్తాన్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఐపీఎల్ 2021 కోసం ప్రస్తుతం కుంబ్లే యూఏఈలో ఉన్నారు. పంజాబ్ కింగ్స్‌కు కోచింగ్ ఇస్తున్నాడు.
కోచ్ రేసులో లక్ష్మణ్ కూడా..
ప్రధాన కోచ్ కోసం అనిల్ కుంబ్లేను బీసీసీఐ సంప్రదించింది. అలాగే, మరో సమాచారం ప్రకారం వీవీఎస్ లక్ష్మణ్‌ను కూడా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. అనిల్ కుంబ్లేను సంప్రదించడానికి ముందు బీసీసీఐ ప్రధాన కోచ్ కోసం శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేను కూడా సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే శ్రీలంక జట్టు, ఐపీఎల్ జట్టుకు కోచింగ్ ఇవ్వడానికి మాత్రమే అతను ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తుంది. జయవర్ధనే ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా ఉన్నారు.
అయితే, అనిల్ కుంబ్లే టీమిండియాలో రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేయడానికి అంగీకరిస్తే, పంజాబ్ కింగ్స్‌ని విడిచిపెట్టాల్సి వస్తుంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్నవారు.. మరే ఇతర జట్టుకు కోచ్‌గా ఉండకూడదు.
చెదిరిన కల..
2016 సంవత్సరంలో అనిల్ కుంబ్లే మొదటిసారి టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి కోహ్లీ, కుంబ్లేల మధ్య విభేదాలు కూడా మొదలయ్యాయి. దీంతో కుంబ్లే తన పదవికి రాజీనామా చేశారు. అయితే కుంబ్లే రాజీనామాలో, కోహ్లీ పని తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. ఈ విషయమై కోహ్లీ అసహనం కూడా వ్యక్తం చేశాడు. మా మధ్య ఉన్న గందరగోళాన్ని పరిష్కరించడానికి బిసీసీఐ ప్రయత్నించిందని కుంబ్లే తన రాజీనామాలో పేర్కొన్నాడు. ప్రస్తుతం మరోసారి కుంబ్లే హెచ్ కోచ్‌గా ఎన్నికైతే.. విరాట్ కోహ్లీ ఏంచేస్తాడో చూడాలి.