
IPL Auction 2026 : భారత క్రికెట్ జట్టులో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు గత కొన్నేళ్లుగా తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియాలో కీలక యువ ఆటగాళ్లుగా ఉన్న నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ వంటివారు కూడా ఐపీఎల్ ద్వారానే తమ సత్తా చాటి, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు. తాజాగా మరో ఇద్దరు తెలుగు యువ ఆటగాళ్లు రాబోయే ఐపీఎల్ సీజన్‌లో మెరవడానికి సిద్ధమయ్యారు. మంగళవారం అబుదాబిలో జరిగిన మినీ-వేలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒక్కో అన్‌క్యాప్డ్ ఆటగాడిని వేర్వేరు ఫ్రాంఛైజీలు వారి బేస్ ప్రైస్కు దక్కించుకున్నాయి.
గుజరాత్ టైటాన్స్ జట్టులోకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్
ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎర్రా పృథ్వీరాజ్ ను గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షల కనీస ధరతో కొనుగోలు చేసింది. గతంలో పృథ్వీరాజ్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్ల తరఫున ఎంపికయ్యాడు. అయితే, ఆ రెండు జట్లలోనూ అతనికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. దీంతో ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌కు ఎంపికైనందున, ప్రధాన పేసర్‌గా ఉన్న రబాడాకు మద్దతుగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా అతనికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తెలంగాణ హిట్టర్
తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన 21 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ పేరాల అమన్ రావును రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షల కనీస ధరకే దక్కించుకుంది. అమన్ రావుకు ఇది తొలి ఐపీఎల్ సీజన్. ప్రస్తుతం అతను రంజీ స్థాయిలో హైదరాబాద్ అండర్-23 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో అతని దూకుడు బ్యాటింగ్ శైలి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు చేయడంతో, వేలానికి ముందే ఫ్రాంఛైజీల దృష్టి అతనిపై పడింది.
కెరీర్‌కు కీలకం కానున్న ఐపీఎల్ 2026 సీజన్
ఈ ఇద్దరు తెలుగు ఆటగాళ్లకు ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత కీలకం కానుంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది యువకులు ఐపీఎల్‌లో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని జాతీయ జట్టులో స్థానం సంపాదించారు. అదేవిధంగా పృథ్వీరాజ్, అమన్ రావు కూడా ఈ సీజన్‌లో తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం దొరికితే, అది వారి కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..