
Babar Azam selection controversy: టీ20 వరల్డ్ కప్ 2026లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ మార్పులు మొదలయ్యాయి. ఈ పరిణామాల్లో భాగంగా పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ సభ్యుడు, మాజీ అంతర్జాతీయ అంపైర్ అలీం దార్ తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)లో సెలెక్టర్‌గా 2024లో చేరిన అలీం దార్, కమిటీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు, నిర్ణయాల్లో స్వేచ్ఛ లేకపోవడమే రాజీనామాకు ప్రధాన కారణమని తెలిపారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు సూపర్-8 దశలోనే బయటపడింది. ముఖ్యంగా భారత్, ఇంగ్లాండ్ జట్లపై వచ్చిన ఓటములు జట్టుపై తీవ్ర విమర్శలకు దారి తీశాయి.
ఇప్పటికే జట్టు ఆటగాళ్లపై పీసీబీ భారీ జరిమానాలు విధించిన నేపథ్యంలో, అలీం దార్ రాజీనామా పాకిస్థాన్ క్రికెట్‌లోని అంతర్గత సమస్యలను బహిర్గతం చేసినట్టుగా భావిస్తున్నారు.
పాకిస్థాన్ మీడియా నివేదికల ప్రకారం, టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక సమయంలో అలీం దార్ కొన్ని కీలక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్ ఎంపికను ఆయన తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
వారి తాజా ప్రదర్శనలను దృష్టిలో ఉంచుకుంటే జట్టులో స్థానం ఇవ్వకూడదని దార్ అభిప్రాయపడ్డారని సమాచారం. బదులుగా వికెట్ కీపర్-బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్‌ను నంబర్-6 స్థానంలో స్పష్టమైన పాత్రతో ఆడించాలనే సూచన చేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ సూచనలను పట్టించుకోకపోవడంతో చివరకు బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. టోర్నమెంట్‌లో వారి ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం విమర్శలకు దారితీసింది.
అలీం దార్ అసంతృప్తికి మరో ప్రధాన కారణం హెడ్ కోచ్ మైక్ హెసన్ జోక్యం అని సమాచారం. జట్టు ఎంపికలో కోచ్ అధిక ప్రభావం చూపడం వల్ల సెలక్షన్ కమిటీ స్వతంత్రత తగ్గిందని ఆయన భావించినట్లు తెలుస్తోంది.
సెలెక్టర్ ఆకిబ్ జావేద్ మద్దతుతో హెసన్ నిర్ణయాలు తీసుకోవడం దార్‌కు నచ్చలేదని నివేదికలు చెబుతున్నాయి.
ఇప్పటికే సెలక్షన్ కమిటీ సభ్యులు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, డేటా అనలిస్ట్ ఉస్మాన్ హష్మీ మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో పీసీబీ తమ సెలక్షన్ వ్యవస్థలో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అలీం దార్ రాజీనామా పాకిస్థాన్ క్రికెట్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలకు స్పష్టమైన సంకేతంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..