Rahane-Jaiswal: యశస్వి చేసిన పనికి 4 మ్యాచ్‌ల బ్యాన్.. చివరి నిమిషంలో రహానే ఏం చేశాడంటే?

Rahane-Jaiswal: యశస్వి జైస్వాల్‌పై 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో క్రమశిక్షణా చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని అజింక్య రహానే వెల్లడించారు. నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉన్న సమయంలో, కెప్టెన్‌గా తాను తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల యశస్వి బ్యాన్ నుంచి తప్పించుకున్నాడని తెలిపారు.

Rahane-Jaiswal: యశస్వి చేసిన పనికి 4 మ్యాచ్‌ల బ్యాన్.. చివరి నిమిషంలో రహానే ఏం చేశాడంటే?
Yashasvi Jaiswal

Updated on: Aug 09, 2026 | 7:41 PM

Rahane-Jaiswal: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే ఒక పాత వివాదంపై సంచలన విషయాలను వెల్లడించారు. 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ క్రమశిక్షణా రాహిత్యం కారణంగా అతనిపై ఏకంగా 4 మ్యాచ్‌ల నిషేధం పడే ప్రమాదం ఉండిందని, తాను తీసుకున్న నిర్ణయం వల్లే అతని కెరీర్ నిలిచిందని రహానే తెలిపారు. వెస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ కెప్టెన్‌గా ఉన్న రహానే, మైదానంలో ప్రత్యర్థి బ్యాటర్‌తో తీవ్రంగా వాగ్వాదానికి దిగిన యశస్వి జైస్వాల్‌ను మైదానం నుంచి బయటకు పంపించి వార్తల్లో నిలిచారు.

హద్దులు దాటిన స్లెడ్జింగ్ – హెచ్చరించినా వినని యశస్వి

2022 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్ జోన్ బ్యాటర్ రవి తేజపై యశస్వి జైస్వాల్ వరుసగా స్లెడ్జింగ్‌కు దిగాడు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రవి తేజను అనవసరంగా రెచ్చగొట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్లు యశస్విని అనేకసార్లు హెచ్చరించినప్పటికీ అతను ఏమాత్రం వినకుండా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. గొడవ పెద్దదిగా మారి ఆట సమయం వృధా అవుతుండటంతో, పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు వెస్ట్ జోన్ కెప్టెన్ అజింక్య రహానే జోక్యం చేసుకున్నారు. జైస్వాల్ ప్రవర్తన నచ్చకపోవడంతో అతడిని మైదానం బయటకు వెళ్లిపోవాల్సిందిగా రహానే ఆదేశించారు.

4 మ్యాచ్‌ల బ్యాన్ లెటర్ చింపేసిన మ్యాచ్ రెఫరీ

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రహానే ఆ సంఘటన వెనుక ఉన్న అసలు నిజాలను వెల్లడించారు. “ఆ సమయంలో మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి రావడం యశస్వికి బాధ కలిగించి ఉండవచ్చు. క్రికెట్‌లో స్లెడ్జింగ్ ఉండటం సాధారణమే, అది ఆటకు వినోదాన్ని ఇస్తుంది. కానీ ఆ రోజు హద్దులు దాటిపోయింది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఇలాంటి ప్రవర్తన వల్ల నిషేధానికి గురవడం నేను చూశాను. అందుకే నా జట్టు ఆటగాడిని కాపాడుకోవడం కెప్టెన్‌గా నా బాధ్యత అనుకున్నాను” అని రహానే చెప్పారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రెఫరీ యశస్విపై 4 మ్యాచ్‌ల నిషేధం విధిస్తూ లెటర్ కూడా సిద్ధం చేశారని, అయితే రహానే తీసుకున్న కఠిన చర్యను చూసి మెచ్చుకుంటూ ఆ లెటర్‌ను తన ముందే చింపేశారని రహానే గుర్తుచేసుకున్నారు.

నేడు టీమిండియా స్టార్‌గా యశస్వి

కెప్టెన్‌గా రహానే ఆ రోజు అంత సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకోకపోయి ఉంటే, యశస్వి జైస్వాల్ తీవ్రమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొని ఉండేవాడు. కానీ రహానే క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చి సొంత జట్టు ఆటగాడినే మైదానం నుంచి బయటకు పంపి మ్యాచ్ రెఫరీకి స్పష్టమైన సందేశమిచ్చారు. దానివల్ల జైస్వాల్‌పై ఎలాంటి నిషేధం పడలేదు. ఆ తర్వాతి కాలంలో తన తప్పు తెలుసుకుని క్రమశిక్షణతో ఆడిన యశస్వి జైస్వాల్, ప్రస్తుతం టీమిండియాలో కీలకమైన ఓపెనర్‌గా మారి అద్భుతమైన రికార్డులతో దూసుకుపోతున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us