Ajay Devgn : అజయ్ దేవగన్-షాహిద్ అఫ్రిది భేటీ.. వైరల్ ఫోటోపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

అజయ్ దేవగన్, షాహిద్ అఫ్రిది భేటీ ఫోటో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 లో జరిగిందనే పుకార్లు వ్యాపించాయి. అయితే, ఇది 2024 నాటి ఫోటో అని స్పష్టమైంది. పహల్గామ్ దాడి కారణంగా రద్దైన భారత్-పాక్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 మ్యాచ్, దానిపై అఫ్రిది స్పందించారు.

Ajay Devgn : అజయ్ దేవగన్-షాహిద్ అఫ్రిది భేటీ.. వైరల్ ఫోటోపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Ajay Devgn

Updated on: Jul 21, 2025 | 12:55 PM

Ajay Devgn : బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కలుసుకున్నారంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు భారత అభిమానులలో తీవ్ర విమర్శలకు, ఆగ్రహానికి దారితీశాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ భేటీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 ఎడిషన్‌లో జరిగిందని చాలా మంది నెటిజన్లు ఆరోపించారు. అయితే, నిజాలు పరిశీలిస్తే మాత్రం వేరే కథ వెలుగులోకి వచ్చింది. అజయ్ దేవగన్, షాహిద్ అఫ్రిది ని కలిశాడు. కానీ, అది ఈ సంవత్సరంలో మాత్రం కాదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ మొదటి ఎడిషన్ 2024లో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగినప్పుడు తీసినవి. ఈ టీ20 టోర్నమెంట్‌కు సహ యజమాని అయిన దేవగన్, భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి స్టేడియానికి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

అసలు వివాదం జూలై 20, 2025 ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సిన భారత్, పాకిస్థాన్ మధ్య లెజెండ్స్ మ్యాచ్‌కు సంబంధించింది. అయితే, సోషల్ మీడియాలో, ముఖ్యంగా 26 మంది ప్రాణాలు తీసిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో, నిర్వాహకులు మ్యాచ్ జరగాల్సిన రోజే దానిని రద్దు చేయాలని నిర్ణయించారు. శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా సహా పలువురు ప్రముఖ భారత మాజీ ఆటగాళ్లు ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. శిఖర్ ధావన్ తన నిర్ణయాన్ని మే 11 నాడే నిర్వాహకులకు తెలియజేశానని, పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడబోనని స్పష్టం చేశాడు. ఈ ఆటగాళ్ల ఉపసంహరణ నిర్వాహకులపై మరింత ఒత్తిడి పెంచి, చివరికి మ్యాచ్ రద్దుకు దారితీసింది.

భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచ్ ఆకస్మిక రద్దుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది నిరాశ వ్యక్తం చేశాడు. ఈ చర్య ఒక ఎదురుదెబ్బ అని అతను పేర్కొన్నాడు. ఈ సంఘటనపై స్పందిస్తూ, క్రికెట్ నుంచి రాజకీయాలను దూరంగా ఉంచాలని అఫ్రిది ఇరు దేశాలకు విజ్ఞప్తి చేశాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మాట్లాడుతూ.. మేము ఇక్కడ క్రికెట్ ఆడటానికి వచ్చాం, క్రికెట్‌ను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలి, అది ముందుకు సాగాలి అని నేను ఎప్పుడూ చెబుతాను. ఒక ఆటగాడు మంచి రాయబారిగా ఉండాలి, తన దేశానికి ఇబ్బంది కలిగించేవాడిగా కాదని అన్నాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి