మరికొన్ని గంటల్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ఆతిథ్య జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. గాయం కారణంగా వెటరన్ బ్యాట్స్‌మెన్, బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ జట్టుకు దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో తాత్కాలిక సారధిగా ఎవరు వ్యవహరించనున్నారని టాక్ రాగా.. బంగ్లాదేశ్ బోర్డు తమీమ్ ఇక్బాల్ స్థానంలో తాజాగా, టీ20 ప్రపంచకప్‌లో భారత బౌలర్లను చిత్తు చేసిన దూకుడు బ్యాట్స్‌మెన్, ఓపెనర్ లిటన్ దాస్‌కు జట్టు పగ్గాలను అప్పజెప్పింది. ఈ సిరీస్‌కు అతడు బంగ్లాదేశ్ జట్టుకు సారధిగా వ్యవహరించనున్నాడు.
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేల సిరీస్ డిసెంబర్ 4 ఆదివారం ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ప్రారంభమవుతుంది. వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్‌కు లిటన్ దాస్ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ ఈ ఏడాది మంచి ఫామ్‌లోఉన్నాడు. ఈ సంవత్సరం బంగ్లాదేశ్ తరఫున 10 వన్డేల్లో 62 సగటుతో 500 పరుగులు చేశాడు. ఇది మాత్రమే కాదు, ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో, లిటన్ భారత్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వర్షం-ప్రభావిత మ్యాచ్‌లో, లిటన్ తన అర్ధ సెంచరీని కేవలం 21 బంతుల్లో పూర్తి చేశాడు. ఇది T20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు రికార్డు.
“లిటన్ జట్టులోని అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు, నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్నాడు. అతడికి ఆటపై పూర్తి అవగాహన ఉంది. జట్టును విజయపధంలో తీసుకెళ్లగలడని నమ్ముతున్నాం’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జలాల్ యూనస్ ఓ ప్రకటన ద్వారా ఈ 28 ఏళ్ల బ్యాట్స్‌మెన్‌పై ప్రశంసలు కురిపించాడు .
తమీమ్ గాయం బంగ్లాదేశ్‌కు ఆందోళన కలిగిస్తోంది. అతడు ఇప్పటికే వన్డే సిరీస్‌కు దూరం కాగా, డిసెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో కూడా అతడు ఆడటంపై సందేహం నెలకొంది. ఇక అటు బంగ్లాదేశ్ తమ కెప్టెన్‌ను కోల్పోవడమే కాకుండా, ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్ కూడా లేకుండానే సిరీస్‌ను ప్రారంభించాల్సి ఉంది. వెన్ను నొప్పి సమస్య కారణంగా తస్కిన్ తొలి వన్డేకు దూరంగా ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..