Harmanpreet Kaur: ‘నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు..’ సన్ గ్లాసెస్ ఎందుకు పెట్టుకుందో చెప్పిన హర్మన్‌ప్రీత్ కౌర్..

నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదనుకుంటున్నాను. అందుకే నేను ఈ అద్దాలు ధరించాను. మేము ఖచ్చితంగా మెరుగవుతాం. మరోసారి దేశాన్ని నిరాశపర్చబోమని నేను మాటిస్తున్నాను..

Harmanpreet Kaur: నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. సన్ గ్లాసెస్ ఎందుకు పెట్టుకుందో చెప్పిన హర్మన్‌ప్రీత్ కౌర్..
Harmanpreet Kaur

Updated on: Feb 24, 2023 | 1:29 PM

వుమెన్‌ టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి భారత్‌ నిష్క్రమించింది. నువ్వానేనా అన్నట్టు అత్యంత ఉత్కంఠగా సాగిన సెమీస్‌ ఫైట్‌లో పోరాడి ఓడింది టీమిండియా. ఐదే ఐదు పరుగుల తేడాతో భారత్‌పై గెలిచి ఫైనల్‌కి చేరింది ఆసీస్‌. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ స్టేడియంలో జరిగిన సెమీస్‌లో కేవలం ఐదే ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది భారత్‌. ఆస్ట్రేలియాపై చివరివరకు పోరాడిన ఇండియన్‌ అమ్మాయిలు చివరికి చేతులెత్తేశారు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌… 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, మ్యాచ్‌ చివరివరకు తీవ్ర ఉత్కంఠగా సాగింది. నువ్వానేనా అన్నట్టుగా జరిగింది మ్యాచ్‌. విజయం కోసం ఇటు భారత్‌, అటు ఆస్ట్రేలియా సర్వశక్తులూ ఒడ్డాయ్‌. అయితే విజయం మాత్రం ఆసీన్‌ను వరించింది. ఆఖరి ఓవర్లో భారత్‌ గెలవడానికి 16 పరుగులు చేయాల్సి ఉండగా 10 రన్స్‌ మాత్రమే చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో విజయాన్ని తమవైపు లాగేసుకున్నారు ఆసీస్‌ అమ్మాయిలు.

చివరి వరకు పోరాడి ఓడిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. ఓ వైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ హర్మన్‌ ఈ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడింది. అయితే కీలక సమయంలో హర్మన్‌ దురదృష్టకర రీతిలో రనౌట్‌తో వెనుదిరగడం మొత్తం మ్యాచ్‌‌ను టర్న్ చేసింది. 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌ తో 52 పరుగులు చేసింది హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.

అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత హర్మన్‌ప్రీత్‌ తీవ్ర భావోద్వేగాన్ని ఆపులోకపోయారు. మైదానంలోనే కన్నీరు పెట్టుకుంది హర్మన్‌. భారత మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చడం.. ఆ తర్వాత ఆ కన్నీటిని ఎవరికి కనిపించకుండా టీమ్ మొత్తానికి ధైర్యం చెప్పారు.

ఆట ముగిసిన తర్వాత మ్యాచ్‌ ప్రెజెంటేషన్ సమయంలో సన్‌గ్లాసెస్‌ పెట్టుకుని హర్మన్‌ కనిపించారు. అయితే, గ్లాసెస్ ఎందుకు ధరించారని హర్మన్‌కు ప్రెజెంటేటర్‌ వేసిన ప్రశ్నకు ధీటైన సమాధానం చెప్పారు. “నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదనుకుంటున్నాను. అందుకే నేను ఈ అద్దాలు ధరించాను. మేము ఖచ్చితంగా మెరుగవుతాం. మరోసారి దేశాన్ని నిరాశపర్చబోమని నేను మాటిస్తున్నాను” అని హర్మన్‌ప్రీత్‌ చెప్పారు. హర్మన్‌ప్రీత్‌ చెప్పిన ఈ సమాధనం దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.


మరిన్ని క్రికెట్ వార్తల కోసం