Pakistan Air Strikes : కాబూల్‌పై పాక్ వైమానిక దాడులు.. 400 మంది మృతి.. ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఎమోషనల్ మెసేజ్

Pakistan Air Strikes : అఫ్గాన్‌పై పాక్ జరిపిన వైమానిక దాడులను ముంబై ఇండియన్స్ ప్లేయర్ అల్లా గజన్ ఫర్ ఖండించారు. భారత్ తమకు ప్రాణ స్నేహితుడని, ఈ సంక్షోభంలో ఆదుకోవాలని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ క్లిష్ట సమయంలో భారత్‌తో తమకున్న అనుబంధాన్ని గజన్ ఫర్ గుర్తు చేసుకున్నారు.

Pakistan Air Strikes : కాబూల్‌పై పాక్ వైమానిక దాడులు.. 400 మంది మృతి.. ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఎమోషనల్ మెసేజ్
Afghan Star Allah Ghazanfar

Updated on: Mar 18, 2026 | 10:04 AM

Pakistan Air Strikes : అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన భీకర వైమానిక దాడులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో అఫ్గాన్ యువ స్పిన్నర్, ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న అల్లా గజన్ ఫర్ (Allah Ghazanfar) అత్యంత భావోద్వేగంతో కూడిన సందేశాన్ని ఇచ్చారు. కాబూల్‌లోని ఒక డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ పై జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనపై గజన్ ఫర్ స్పందిస్తూ.. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా భారత్ తమకు అండగా నిలవాలని కోరారు.

పాకిస్థాన్ చేసిన ఈ దాడులను గజన్ ఫర్ తీవ్రంగా ఖండించారు. “నిస్సహాయులు, పేదలు చికిత్స పొందే ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోవడం ఏంటి? వారు అమాయకులను చంపి ఏం నిరూపించాలనుకుంటున్నారు?” అని ఆయన నిలదీశారు. 2,000 పడకలు ఉన్న ఆ భారీ రిహాబిలిటేషన్ సెంటర్ ధ్వంసం కావడం వల్ల సాధారణ ప్రజలకు వైద్యం అందకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్ చరిత్ర ఎవరికీ తెలియనిది కాదని, ఒకవేళ చరిత్ర పునరావృతమైతే అది పాకిస్థాన్‌కు చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. అమాయక ప్రజల ప్రాణాలు తీయడం అఫ్గాన్ ప్రజలు ఎప్పటికీ సహించరని స్పష్టం చేశారు.

ఈ క్లిష్ట సమయంలో భారత్‌తో తమకున్న అనుబంధాన్ని గజన్ ఫర్ గుర్తు చేసుకున్నారు. “భారత్ మాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం. ఇలాంటి సమస్యలపై మేము వారితో చర్చించాలనుకుంటున్నాం. భారత్ లాంటి దేశాలు జోక్యం చేసుకుంటే ఇలాంటి దాడులు జరగకుండా చూడవచ్చు” అని ఆయన పేర్కొన్నారు. కేవలం భారత్ మాత్రమే కాకుండా, ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఈ హింసను అడ్డుకోవాలని విన్నవించారు. యుద్ధాలు, దాడుల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని, ఇది కేవలం సామాన్య ప్రజల జీవితాలను నాశనం చేస్తుందని ఆయన అన్నారు.

ప్రస్తుతం అఫ్గానిస్థాన్ ప్రభుత్వం ఈ దాడులకు పాకిస్థానే కారణమని ఆధారాలతో సహా ఆరోపిస్తుండగా, పాక్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఐపీఎల్ కోసం భారత్‌కు రానున్న తరుణంలో గజన్ ఫర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక క్రికెటర్‌గా మైదానంలోనే కాకుండా, తన దేశ ప్రజల తరపున గొంతు వినిపిస్తూ ఆయన చేసిన విన్నపం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ అఫ్గాన్ కు ఎప్పుడూ ఒక పెద్దన్నలా సాయం చేస్తూనే ఉందని, ఇప్పుడు కూడా అదే ఆశిస్తున్నామని ఆయన మాటల సారాంశం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us