
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ద్వైపాక్షిక సిరీస్‌లలో పరుగుల వరద పారించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కీలకమైన టోర్నీలో విఫలం కావడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీపై తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. అయితే, కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో పాత అభిషేక్‌ను గుర్తు చేస్తూ బౌలర్లను చీల్చి చెండాడాడు. తన అటాకింగ్ గేమ్‌తో మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించి విమర్శకుల నోళ్లు మూయించాడు.
ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలచడం ద్వారా అభిషేక్ శర్మ తన టీ20 కెరీర్‌లో 300 సిక్సర్ల మైలురాయిని దాటాడు. టీ20 ఫార్మాట్‌లో 300 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన రెండో భారత ఓపెనర్‌గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత కేవలం టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద మాత్రమే ఉండేది. రోహిత్ 330 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అభిషేక్ ప్రస్తుతం 301 సిక్సర్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు.
2024 ఐపీఎల్ సీజన్ వరకు అభిషేక్ శర్మ సన్ రైజర్స్ జట్టులో ఒక సాధారణ ఆటగాడిగా మాత్రమే ఉండేవాడు. కానీ గత రెండేళ్లలో అతని ఆట తీరు పూర్తిగా మారిపోయింది. పవర్ ప్లేలోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ జట్టుకు మెరుపు ఆరంభాలను అందించడం అతనికి అలవాటుగా మారింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అతను సిక్సర్ల మెషిన్‌లా మారిపోవడం విశేషం. ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే రోహిత్ శర్మ రికార్డును కూడా అధిగమించే అవకాశం కనిపిస్తోంది.
అభిషేక్ శర్మ ఫామ్‌లోకి రావడం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌లో ట్రావిస్ హెడ్‌తో కలిసి అతను చేసే విధ్వంసం ప్రత్యర్థి జట్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తన సహజసిద్ధమైన దూకుడుతో పరుగుల వేట కొనసాగిస్తున్న ఈ యువ కిశోరం, రాబోయే మ్యాచుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం సిక్సర్లకే పరిమితం కాకుండా నిలకడగా రాణించడంపై ఈ పంజాబ్ బ్యాటర్ దృష్టి సారిస్తున్నాడు. కాగా, అభిషేక్ హాఫ్ సెంచరీ చేయకుండానే (48 పరుగులు) వెనుదిరిగాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి 123 పరుగులు చేసింది.