9 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు.. 377 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు తాండవం..

Abhishek Sharma: అభిషేక్ శర్మ ఇప్పటికే చాలాసార్లు తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, ఈసారి బౌలింగ్‌లో కూడా సత్తా చాటి తన ఆల్ రౌండ్ ఆటతో షాకిచ్చాడు. పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అభిషేక్ అద్భుతమైన బౌలింగ్ ఆరంభాన్ని అందించాడు. తన జట్టును విజయపథంలో నడిపించాడు.

9 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు.. 377 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు తాండవం..
Abhishek Sharma

Updated on: Dec 05, 2025 | 7:35 AM

Abhishek Sharma: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో పంజాబ్ కెప్టెన్, టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ అద్భుత ప్రదర్శన చేసి పంజాబ్ జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు అభిషేక్ ఈ రకమైన ఫామ్‌లో ఉండటం విశేషం.

తుఫాను ఇన్నింగ్స్ (9 బంతుల్లో 34 పరుగులు)..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టుకు అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా, పరుగుల వరద పారించాడు. కేవలం 9 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 377.77 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 34 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతని బ్యాట్ నుంచి వచ్చిన ప్రతి పరుగు బౌండరీల రూపంలోనే వచ్చింది.

బౌలింగ్‌లోనూ మ్యాజిక్..

బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించిన అనంతరం, బౌలింగ్‌లోనూ అభిషేక్ తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తన స్పిన్ బౌలింగ్‌తో పుదుచ్చేరి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో పుదుచ్చేరి కెప్టెన్ అమన్ ఖాన్ వికెట్ కూడా ఉంది.

అభిషేక్ మెరుపులతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుదుచ్చేరి జట్టు, అభిషేక్ శర్మ, ఆయుష్ గోయల్ (3 వికెట్లు), హర్‌ప్రీత్ బ్రార్ (2 వికెట్లు) ధాటికి 138 పరుగులకే కుప్పకూలింది. దీంతో పంజాబ్ 54 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పుదుచ్చేరి తరపున సిదక్ సింగ్ (61) ఒక్కడే పోరాడాడు.

ఈ విజయంతో ఎలైట్ గ్రూప్-సిలో పంజాబ్ జట్టు బెంగాల్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. టీమిండియా టీ20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా చూస్తున్న తరుణంలో, అభిషేక్ శర్మ ఆల్ రౌండ్ ప్రదర్శన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..