Cricket Record : 137 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు.. ఇది బ్రేక్ అయిందా.. అలాగే ఉందా అన్నా

సరిగ్గా 137 సంవత్సరాల క్రితం 1888లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఒకే రోజులో 27 వికెట్లు పడిపోయాయి. ఈ రికార్డు 137 ఏళ్లుగా చెక్కుచెదరలేదు. ఆ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ఎలా ముగిసిపోయింది. ఆ చారిత్రక మ్యాచ్ 1888 జూలై 16న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. మూడు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో ఇది మొదటి టెస్ట్ మ్యాచ్.

Cricket Record : 137 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు.. ఇది బ్రేక్ అయిందా.. అలాగే ఉందా అన్నా
Cricket Record

Updated on: Jul 15, 2025 | 5:39 PM

Cricket Record : క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు కనీ వినీ ఎరుగని విధంగా ఉంటాయి. వాటిలో ఒకటి టెస్ట్ మ్యాచ్‌లో ఒకే రోజులో అత్యధిక వికెట్లు పడటం. సరిగ్గా 137 సంవత్సరాల క్రితం.. అంటే 1888లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో ఈ అసాధారణ రికార్డు నమోదైంది. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచిపోయింది. ఆ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ఎలా ముగిసిపోయింది? ఆ రోజు ఏం జరిగింది? ఆసక్తికరమైన వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆ చారిత్రక మ్యాచ్ 1888 జూలై 16న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. మూడు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో ఇది మొదటి టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజులలోనే ముగిసిపోయింది. ఇరు జట్ల బౌలర్లు తమ ప్రమాదకరమైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టారు. దీనితో ఒకే రోజులో ఏకంగా 27 వికెట్లు పడిపోయాయి. మొదటి రోజు జూలై 16 నాడు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి కేవలం 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ తరపున రాబర్ట్ పీల్ 4 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్, మొదటి రోజు ఆట ముగిసేసరికి 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత వచ్చిన మ్యాచ్ రెండో రోజు చరిత్రలో నిలిచిపోయింది. రెండో రోజు ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించి, కేవలం 53 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్ చార్లీ టర్నర్ 5 వికెట్లు తీశాడు. తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. వాళ్లు కూడా ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి కేవలం 60 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇంగ్లాండ్ తరపున మళ్ళీ పీల్ 4 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్‌కు గెలవడానికి 124 పరుగుల స్వల్ప లక్ష్యం లభించింది.

అయితే, స్వల్ప టార్గెట్ ఛేదించడంలో కూడా ఇంగ్లాండ్ జట్టు విఫలమై, కేవలం 62 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 61 పరుగుల తేడాతో ఈ చారిత్రక మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో చార్లీ టర్నర్, జాన్ ఫెర్రిస్ ఇద్దరూ ఐదేసి వికెట్లు తీసి చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 27 వికెట్లు పడిపోయాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఒక అరుదైన, ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..