
15 Years of 2011 World Cup Glory : భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఏప్రిల్ 2, 2011. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ సచిన్ టెండూల్కర్ కలను సాకారం చేసిన ఆ రాత్రిని భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. నేటికి ఆ అద్భుత విజయానికి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జ్ఞాపకాలు వెల్లువెత్తుతున్నాయి. వరల్డ్ కప్ విజయం సాధించి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఒక ప్రత్యేకమైన వీడియోను షేర్ చేశారు. టీమిండియా కొత్త జెర్సీ ధరించిన సచిన్, 2011 ఫైనల్ మ్యాచ్‌లో మొదటి బంతిని ఎదుర్కొన్నప్పటి తన అనుభూతిని పంచుకున్నారు. “ఆ రాత్రి మొదటి బంతి పడే ముందు నా గుండె వేగంగా కొట్టుకుంది.. అది ఇప్పటికీ ఆగలేదు” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక జట్టుగా అందరం కలిసి ఇండియా కోసం వరల్డ్ కప్ గెలవాలన్న ఒకే కలని కన్నామని, ఆ ప్రయాణంలో భాగమైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన రాసుకొచ్చారు.
యువరాజ్ సింగ్ అజేయ రికార్డు
ఆ వరల్డ్ కప్‌లో భారత్ విజయం వెనుక అందరి శ్రమ ఉన్నప్పటికీ, యువరాజ్ సింగ్ చేసిన ప్రదర్శన మాత్రం అద్వితీయం. 2011 వరల్డ్ కప్ హిస్టరీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన యువీ, ఒక అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒకే వరల్డ్ కప్ టోర్నీలో 300కు పైగా పరుగులు చేసి, 15 వికెట్లు పడగొట్టిన ఏకైక ఆల్‌రౌండర్‌గా యువరాజ్ చరిత్రకెక్కాడు. ఆ టోర్నీలో యువీ 90.5 సగటుతో 362 పరుగులు చేయడమే కాకుండా, తన బౌలింగ్‌తో 15 మందిని పెవిలియన్‌కు పంపాడు.
2027 వరల్డ్ కప్‌లో రికార్డు చెక్కుచెదరకుండా ఉంటుందా?
యువరాజ్ సింగ్ సృష్టించిన ఈ రికార్డు గత 15 ఏళ్లుగా ఎవరూ టచ్ చేయలేకపోయారు. 2015, 2019, 2023లో మూడు వన్డే వరల్డ్ కప్ టోర్నీలు గడిచినా ఏ ఒక్క ఆల్‌రౌండర్ కూడా 300+ రన్స్, 15 వికెట్ల మార్కును అందుకోలేకపోయారు. ఇప్పుడు అందరి కళ్లు 2027 వన్డే వరల్డ్ కప్ పైనే ఉన్నాయి. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి మేటి ఆల్‌రౌండర్లు ఉన్నప్పటికీ, యువీ సృష్టించిన ఆ భారీ మార్కును అందుకోవడం కత్తి మీద సామే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
The first ball always makes your heart race… and that night, it never stopped.
15 years later, it still stays with us. We all grew up as a bunch of young cricketers, united by one dream. To win the World Cup for India.
To everyone who was a part of the journey, and to all the… pic.twitter.com/rW141yJraF
— Sachin Tendulkar (@sachin_rt) April 2, 2026
ఆ జ్ఞాపకం.. ఒక స్ఫూర్తి
2011 విజయం కేవలం ఒక కప్పు మాత్రమే కాదు, అది కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవం. ఆ విజయం తర్వాత భారత్ క్రికెట్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. నేటికీ యువ క్రికెటర్లకు ఆనాటి ధోనీ సిక్సర్, గంభీర్ పోరాటం, సచిన్ కన్నీళ్లు, యువీ ఆల్‌రౌండ్ షో ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నాయి. 15 ఏళ్లు గడిచినా ఆ రోజు వాంఖడే స్టేడియం బయట జరిగిన సంబరాలు, జెండాల రెపరెపలు నేటికీ కళ్లముందే కదలాడుతుంటాయి.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..