Telugu News Sports News Anahat Singh India's youngest athlete 14 years old beats Jada Ross in Womens single Squash at CWG 2022
CWG 2022: కామన్వెల్త్‌లో సంచలనం.. స్క్వాష్‌లో తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లిన 14 ఏళ్ల అనహత్..
COMMONWEALTH GAMES 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తొలిరోజు మెరుగైన శుభారంభం దక్కింది. మొదటి రోజు పతకం సాధించలేకపోయినా వివిధ విభాగాల్లో మన అథ్లెట్లు సత్తా చాటారు. మహిళల క్రికెట్‌లో ఓటమి ఎదురైనా..
COMMONWEALTH GAMES 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తొలిరోజు మెరుగైన శుభారంభం దక్కింది. మొదటి రోజు పతకం సాధించలేకపోయినా వివిధ విభాగాల్లో మన అథ్లెట్లు సత్తా చాటారు. మహిళల క్రికెట్‌లో ఓటమి ఎదురైనా టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, హకీలో భారత జట్టు అద్భుతంగా రాణించి తదుపరి రౌండ్‌లకు అర్హత సాధించింది. ఇక మొదటి రోజు క్రీడల్లో అత్యంత హర్షించదగ్గ విషయమేమిటంటే.. 14 ఏళ్ల భారత స్క్వాష్ క్రీడాకారిణి అనహత్ సింగ్ (Anahat Singh) విజయం. భారత్ నుంచి ప్రతిష్ఠాత్మక గేమ్స్‌లో పాల్గొంటోన్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన అనహత్ మొదటి రౌండ్‌ను దిగ్విజయంగా ముగించింది. రౌండ్ ఆఫ్ 64 స్క్వాష్ గేమ్ మహిళల సింగిల్స్ విభాగంలో సెయింట్ విన్‌సెంటి అండ్ గ్రెనడైన్స్‌కి చెందిన జాడా రాస్‌ను ఓడించి రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. తొలి రౌండ్ గేమ్‌లో రాస్ ఐదుపాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా పట్టువిడవలేదు ఈ టీనేజర్. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తూ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 11-5,11-2,11-0 వరుస గేమ్స్‌లో రాస్‌ను మట్టికరిపించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక రౌండ్ ఆఫ్ 32లో అనహత్ సింగ్ వేల్స్‌కు చెందిన ఎమిలి విట్‌లాక్‌తో తలపడనుంది.
ఇక అనహత్ విషయానికొస్తే చిన్నప్పటి నుంచే స్క్వాష్‌పై ఆసక్తి పెంచుకుంది. ఆరేళ్ల వయసులోనే అద్భుతాలు సృష్టించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే అండర్-15 స్థాయిలో సత్తాచాటి భారత జట్టులోకి ఎంపికైంది. ఈ ఏడాది ఆసియా జూనియర్ స్క్వాష్, జర్మన్ ఓపెన్‌లలో ఛాంపియన్‌గా నిలిచింది. నేషనల్ ట్రయల్స్‌లో సత్తాచాటి కామన్వెల్త్‌కు అర్హత సాధించింది. అయితే అనహత్ మొదట బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకుంది. అయితే తన సోదరి అమీరా స్క్వాష్ ఆడడంతో తన మనసును కూడా మార్చుకుంది. మొదట్లో సరదాగా ఆడినా ఆ తర్వాత కఠినంగా ప్రాక్టీస్ చేసింది. ‘నాకు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. అయితే అప్పుడప్పుడు మా సోదరితో కలిసి వెళ్లి సరదాగా 15-20 నిమిషాలు స్వ్వాష్ ఆడేదాన్ని. అయితే ఈ గేమ్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. సరదాగా ఆడేకొద్దీ స్వ్వాష్‌పై ఇష్టం పెరిగింది. క్రమంగా దీనిపై నా మనసు మళ్లించాను. సీరియస్‌గా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ ఎమర్జింగ్ ప్లేయర్. అనాహత్ ఇప్పటివరకు 46 జాతీయ పతకాలు, రెండు జాతీయ సర్క్యూట్ టైటిల్స్, రెండు జాతీయ ఛాంపియన్‌షిప్‌లు, అలాగే ఎనిమిది అంతర్జాతీయ టైటిల్‌లను గెలుచుకుంది.