Karate Player Selling Tea: వయసు పాతికేళ్లు.. సాధించిన మెడల్స్ 60.. కుటుంబ పోషణకు చాయ్‌వాలాగా మారిన ప్రపంచ కరాటే ఛాంపియన్‌!

|

Jun 15, 2021 | 6:57 PM

దేశం గర్వించదగ్గ పతకాలను అందించాడు. పాతికేళ్ల వయసు నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించాడు. కరాటేలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే పూట గడవక పస్తుండాల్సి వస్తోంది.

Karate Player Selling Tea: వయసు పాతికేళ్లు.. సాధించిన మెడల్స్ 60.. కుటుంబ పోషణకు చాయ్‌వాలాగా మారిన ప్రపంచ కరాటే ఛాంపియన్‌!
Karate Player Hariom Shukla Selling Tea
Follow us on

Karate Player Selling Tea: దేశం గర్వించదగ్గ పతకాలను అందించాడు. పాతికేళ్ల వయసు నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించాడు. కరాటేలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే పూట గడవక పస్తుండాల్సి వస్తోంది. దీంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు చాయ్‌వాలా అవతారమెత్తాడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హరిఓమ్ శుక్లా. ప్రస్తుతం మథురలో రోడ్డు పక్కన టీ అమ్ముతూ కాలం వెల్లదీస్తున్నాడు.

పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ప్రపంచఖ్యాతి గాంచిన శుక్లా.. నేడు కుటుంబ పోషణ కోసం రోడ్డెక్కి చిరువ్యాపారిగా మారాడు. దేశ, విదేశాల్లో జరిగిన అనేక పోటీల్లో పతకాలు సాధించిన ఆయన.. ఇల్లు గడవని దీనస్థితిలో కాలం వెల్లబుచ్చుతున్నాడు.

ఆరేళ్ల ప్రాయంలోనే హరిఓమ్ శుక్లా కరాటేలో ఓనమాలు దిద్దుకున్నాడు. అతనికి 23 ఏళ్లు వచ్చేసరికి 60కి పైగా పతకాలు సాధించాడు. 2013లో థాయ్‌లాండ్‌లో జరిగిన జూడో కరాటే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ తరఫున స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టాడు. అయితే, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందకపోవడంతో అతని ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. టోర్నీల్లో గెలుచుకున్న ప్రైజ్ మనీ సైతం అడుగంటి పోయింది.

ఇదే క్రమంలో కుటుంబ భారంతో ఉద్యోగం కోసం ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టుకున్న ఫలితం లేకపోయింది. రోజు రోజుకూ కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొన్ని రోజుల పాటు పాఠశాల విద్యార్థులకు కరాటే పాఠాలు నేర్పించాడు. కరోనా పుణ్యామాన్ని స్కూళ్లన్నీ మూతపడటంతో చేసేదీలేక, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఓ టీ స్టాల్‌ను నడిపిస్తున్నాడు.

Karate Player Hariom Shukla Selling Tea 1

లాక్‌డౌన్‌కు ముందు వరకు స్కూల్‌ పిల్లలకు కరాటే పాఠాలు నేర్పిన శుక్లా.. ప్రస్తుతం ఛాయ్‌‌వాలాగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కరోనా కారణంగా పిల్లలెవరూ క్లాసులకు హాజరు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీ స్టాల్ నడుపుతున్నాని అతను వాపోతున్నాడు. ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా.. ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా తన వద్ద డబ్బు లేదని.. ఆ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా ఉద్యోగం చూసుకునే వాడినని అంటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడాకారుల కోటాలో తనకు ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంటున్నాడు.

Read Also… Olympic Games: సమ్మర్ ఒలింపిక్ పతకాలలో టాప్‌-10 దేశాలు ఇవే..! భారత్ ప్లేస్ చూస్తే.. పరేషాన్ అవ్వాల్సిందే!