యాదాద్రి (Yadadri) శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి స్వయంభు దర్శనాలకు వేళైంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆలయ విస్తరణ నిర్మాణం చేపట్టడంతో ఆరు సంవత్సరాల తర్వాత స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కృష్ణశిలలతో ఆలయ నిర్మాణం, అబ్బురపడే శిల్పాలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుని.. భక్తజన కోటిని ఆనంద పారవశ్యంలో ముంచెత్తేందుకు సిద్ధమైంది. రేపటి నుంచి(28వ తేదీన) మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన తర్వాత సాధారణ భక్తులకు దర్శనం మొదలుకానుంది. ఏపీలోని తిరుమల(Tirumala) వెంకన్న సన్నిధి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. సాధారణ రోజుల్లోనే 40 వేల మంది వరకు.. సెలవులు, ప్రత్యేక పర్వదినాల్లో దాదాపు 70– 80 వేల మంది దాకా శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధి తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తర్వాత అంతగా భక్తుల(Devotees) తాకిడి ఉండే ఆలయంగా నిలుస్తుందని అంచనా. గత ఆరేళ్లలో బాలాలయంలో సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 30, 40 వేల వరకు దర్శించుకున్నారు. ఇప్పుడు ప్రధానాలయం, స్వయంభూ మూర్తి దర్శనం మొదలైతే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. సాధారణ రోజుల్లో 20వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 40, 50వేల మంది వరకు వస్తారని పేర్కొంటున్నారు.
17వ శతాబ్దం తర్వాత రాతి నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇటుకలు, సిమెంటు వాడకం పెరిగి రాతిని వాడటం ఇబ్బందిగా భావిస్తున్నారు. వందల ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారి పూర్తి రాతి నిర్మాణానికి యాదాద్రి వేదికైంది. ఆలయం కోసం ఏకంగా రెండున్నర లక్షల టన్నుల కృష్ణ శిలలను వినియోగించారు. 1,200 మంది శిల్పులు రాత్రింబవళ్లు పనిచేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. వెయ్యేళ్ల పాటు నిలిచేలా ఇంటర్ లాకింగ్ పరిజ్ఞానం, బరువు సమతూకం అయ్యేలా డిజైన్ చేసి ఆలయాన్ని నిర్మించారు. పిడుగుపాటుతో నష్టం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దాదాపు రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో యాదాద్రి పునర్నిర్మాణాన్ని చేపట్టారు. 2015లో మొదలైన నిర్మాణం ఇటీవలే పూర్తయింది. అబ్బురపడే రీతిలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది.
Also Read
Prashant Kishore: పీకే వ్యూహం పని చేస్తుందా.. గెలిచేదెవరు ఓడేదెవరు..
Naming Children: పిల్లలకి పేరు పెడుతున్నారా.. పొరపాటున ఈ తప్పులు చేయకండి..!
Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం