సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? సూర్యుడు, శనికి సంబంధమేంటి?

శాస్త్రాల ప్రకారం మకర రాశికి అధిపతి శనిదేవుడు. సంక్రాంతి రోజున సూర్యుడు శనిదేవుని రాశిలో ప్రవేశించడంతో నువ్వులను శనిదేవుని ప్రసాదంగా భావిస్తారు. అందుకే ఈ రోజున నువ్వులతో చేసిన లడ్డూలను తినడం, దానం చేయడం ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు. నువ్వులు దానం చేస్తే శని దోషాలు తగ్గి, జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని విశ్వాసం.

సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? సూర్యుడు, శనికి సంబంధమేంటి?
Till Laddu

Updated on: Jan 14, 2026 | 1:53 PM

దేశ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలను ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి హిందూ ధర్మంలోని ప్రధాన పండగలలో ఒకటి. సంక్రాంతి పండగ తెలుగు ప్రజలకు పెద్ద పండగ కాగా.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పండగను వివిధ పేర్లతో వారి వారి సాంప్రదాయాల ప్రకారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు వివిధ రకాల ప్రత్యేక ఆహార పదార్థాలను తయారు చేసి ఆరగిస్తారు.

సంక్రాంతి సందర్భంగా చేసే ఆహార పదార్థాలు, పిండి వంటకాల్లో నువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేగాక, నువ్వులు, బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని తినే సంప్రదాయం ఉంది. నువ్వులను సంక్రాంతి రోజు ఎందుకు ప్రత్యేకమో ఇప్పుడు తెలుసుకుందాం.

శనిగ్రహం
మకర సంక్రాంతినాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండగను మకర సంక్రాంతి అని పిలుస్తారు. మకర రాశి అధిపతి శని దేవుడు. సూర్యుడు, శని దేవుడు తండ్రీకొడుకులు అయినప్పటికీ.. వారు ఒకరికొకరు శత్రుత్వం కలిగి ఉంటారు. అలాంటి పరిస్థితిలో సూర్యదేవుడు శని ఇంట్లోకి ప్రవేశించినప్పుడు.. నువ్వులను తీసుకోవడంలో శని వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించడు.

శాస్త్రీయ దృక్కోణంలో నువ్వులు, బెల్లం ప్రత్యేకత

మకర సంక్రాంతి రోజును నువ్వులు, బెల్లం మతపరమైన ప్రాముఖ్యతతోపాటు శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. సంక్రాంతి పండగ శీతాకాలంలో వస్తుంది కాబట్టి.. నువ్వులు, బెల్లం తీసుకోవడం వల్ల శరీరం చలిని తట్టుకునే విధంగా మారుతుంది. శీతాకాలంలో నువ్వులు, బెల్లం కలిపి తినడం వల్ల శరీరం వెచ్చగా మారుతుంది. అంతేగాక, శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

నువ్వులతో సూర్యుడు, శనికి మధ్య సంబంధం

మకర సంక్రాంతి రోజున నువ్వులు తినడం, దానం చేయడం వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉంది. సూర్యభగవానుడికి ఇద్దరు భార్యలు ఛాయ, సంజ్ఞ (సంజన). శని దేవుడు ఛాయ కుమారుడు, యమరాజు సంజ్ఞ కుమారుడు. ఒకరోజు, సూర్యభగవానుడు సంజ్ఞ కుమారుడైన యమరాజు పట్ల వివక్ష చూపుతున్న ఛాయను చూసి ఆగ్రహానికి గురయ్యాడు. ఛాయ, శనిని తన నుంచి దూరం చేశాడు. దీని కారణంగా శని, ఛాయ కోపించి సూర్యభగవానుడిని కుష్టు వ్యాధితో బాధపడమని శపించాడు. ఇక, తన తండ్రి ఇబ్బందుల్లో ఉండటం చూసి.. యమరాజు తీవ్ర తపస్సు చేసి సూర్యభగవానుడిని కుష్టు వ్యాధి నుంచి ముక్తి కల్పించాడు. కానీ, సూర్యభగవానుడు కోపంతో కుంభాన్ని తగలబెట్టాడు, ఇది శని మహారాజ్ నివాసంగా పరిగణిస్తారు. దీంతో శని, అతని తల్లి బాధపడ్డారు.

నువ్వుల దానంతో శుభ ఫలితాలు

అప్పుడు యమరాజు తన తండ్రి సూర్యదేవుడిని శని మహారాజ్‌ను క్షమించమని అభ్యర్థించాడు. ఆ తర్వాత, సూర్యదేవుడు.. శని ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో, అక్కడ అంతా కాలిపోయి ఉంది.. శనిదేవుడి వద్ద నువ్వులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి అతను నువ్వులతో సూర్యభగవానుడిని పూజించాడు. దీంతో శనిని సూర్య భగవానుడు అనుగ్రహించాడు. మకర సంక్రాంతి రోజున, నల్ల నువ్వులతో సూర్యుడిని పూజించే వారి కష్టాలన్నీ తొలగిపోతాయని వరమిచ్చాడు. కాబట్టి, ఈ రోజున, సూర్యభగవానుడిని నువ్వులతో పూజించడమే కాకుండా, ఏదో ఒక రూపంలో కూడా తింటారు. నువ్వులను దానం చేసినా శుభ ఫలితాలు పొందుతారు. నువ్వుల దానంతో శని అనుగ్రహం కూడా లభిస్తుంది.

మొత్తంగా చూస్తే, మకర సంక్రాంతి పండుగలో నువ్వుల లడ్డూ కేవలం ఒక వంటకం మాత్రమే కాదు… ఆధ్యాత్మిక విశ్వాసం, శాస్త్రీయ ప్రయోజనం, సంప్రదాయ విలువల సమ్మేళనంగా నిలుస్తోంది.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.