
పరమేశ్వరుడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పటికీ.. ఆయనను శివలింగ రూపంలో అనేక ప్రదేశాల్లో పూజిస్తారు. పురాణాల ప్రకారం, దేవతలు, మహర్షులు, దిక్పాలకులు, యక్ష కిన్నెరులు, గంధర్వులు మోక్షార్థం కోసం శివలింగాలను ప్రతిష్టించేవారు. ఆ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి 50 కి.మీ దూరంలో ఉన్న పంచదార్ల గ్రామంలో ఒక ప్రాచీన శైవ క్షేత్రం ఉంది.. అదే ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం. పంచధార్ల గ్రామం ఫణిగిరి పర్వతం అడివి తూర్పున, రాంబిల్లి మండలంలోని గాజువాక-ఎలమంచిలి మార్గమధ్యలో ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, సాక్షాత్తుగా యమధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడని పురాణాలు చెబుతాయి.
పూర్వంలో ఇక్కడ వర్ధమాన శివలింగం ఉండేది, కానీ కాలక్రమంలో అది దొరక్కుండా మట్టిలోకి మరుగుపడ్డది. యమధర్మరాజు తన అనారోగ్యాన్ని నయం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఈ శివలింగాన్ని పునఃప్రతిష్టించి పూజించినట్లు చెబుతారు. అందువల్ల, ఈ క్షేత్రానికి “ధర్మలింగేశ్వర” అనే పేరు వచ్చింది.
శివలింగం చారిత్రక శక్తిని కలిగిన ఈ ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడిందని శాసనాలు తెలియజేస్తాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపదకు ప్రసిద్ధి చెందింది.
గర్భగృహంలో యమధర్మరాజు ప్రతిష్టించిన ధర్మలింగేశ్వర స్వామి, ఉమా దేవి సమేతుడై దర్శనమిస్తారు. ఆలయం ప్రాంగణంలో గణపతి, కుమారస్వామి, నందీశ్వరుడు విగ్రహాలు కూడా దర్శించవచ్చు.
“పంచధారల” అని పిలవబడే జలధారలు ఆలయం ప్రాంగణంలో ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇదే ప్రాంతంలో రాధా మాధవ స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడి క్షేత్రపాలకుడిగా సేవలందుకుంటారు.
ప్రతి రోజు నిత్యపూజలు, అర్చనలు, హారతులు జరుగుతాయి.
ప్రతి సోమవారం శివునికి ప్రత్యేక అభిషేకం ఉంటుంది.
మాస శివరాత్రి, మహా శివరాత్రి (మాఘ మాసం), దీపోత్సవం (కార్తిక మాసం), ఫాల్గుణ మాసం వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
భక్తుల విశ్వాసం ప్రకారం.. ధర్మలింగేశ్వర స్వామి దర్శనంతో అనారోగ్యాలు తొలగిపోతాయి. యమధర్మరాజు ప్రతిష్టించిన శివలింగం కావున, అపమృత్యు దోషాలు, అకాల మరణ భయం తొలగుతాయని నమ్మకం ఉంది. మీరు కూడా ఒక్కసారి ఈ అద్భుత ఆలయాన్ని దర్శించి శుభాలను పొందండి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)