హిందూ సంప్రదాయంలో గణేశ చతుర్థికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పండుగను దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రతి ఏడాది భాద్రపద శుద్ధ చవితి రోజున ఈ పండుగను జరుపుకుంటాం. ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకలు ఆగస్టు 27, 2025న రానున్నాయి.
వినాయక చవితి 2025 శుభ ముహూర్తం
ఈ సంవత్సరం చవితి తిథి ఆగస్టు 26, 2025న సాయంత్రం 4:32 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27, 2025న మధ్యాహ్నం 3:20 గంటలకు ముగుస్తుంది. వినాయకుడి పూజకు అత్యంత అనుకూలమైన సమయం (శుభ ముహూర్తం) ఉదయం 11:32 నుంచి మధ్యాహ్నం 1:44 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజ చేయడం చాలా మంచిది.
వినాయక చవితి పూజా విధానం
ఈ పండుగ రోజున భక్తులు ఉదయాన్నే లేచి శుభ్రం చేసుకుని, కొత్త బట్టలు ధరిస్తారు. తమ ఇంటిని, పూజ స్థలాన్ని శుభ్రం చేసి, వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. గణేశుడికి ఇష్టమైన లడ్డూలు, మోదకాలు, మరియు ఇతర రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. గరిక, 21 రకాల పత్రాలతో వినాయకుడిని పూజించడం ఈ పూజలో ఒక ప్రధాన భాగం. వినాయక కథను చదివి, పూజ అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి నైవేద్యాన్ని స్వీకరిస్తారు. ఈ పండుగతో అన్ని శుభకార్యాలు ప్రారంభమవుతాయని భక్తుల నమ్మకం.
ఈ వినాయక చవితి (Vinayaka Chavithi)వేడుకలు అందరి జీవితాల్లో సంతోషాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని ఆశిద్దాం.
