Vastu Tips: ఇంట్లో మనశ్శాంతి లేదా? అయితే ఈ వాస్తు మార్పులు చేసుకుంటే సుఖసంతోషాలకు ఇంట్లోకి వెల్కమ్ చెప్పొచ్చు..

| Edited By: Janardhan Veluru

Mar 13, 2023 | 1:36 PM

మీ ఇంట్లో మనశ్శాంతి లోపించిందా.. ? వాస్తుపరంగా ఈ ఇంట్లో ఈ మార్పులు చేసుకుంటే సుఖసంతోషాలకు మళ్లీ వెల్కమ్ చేప్పేయొచ్చు..

Vastu Tips: ఇంట్లో మనశ్శాంతి లేదా? అయితే ఈ వాస్తు మార్పులు చేసుకుంటే సుఖసంతోషాలకు ఇంట్లోకి వెల్కమ్ చెప్పొచ్చు..
Vastu For Main Door[1]
Image Credit source: TV9 Telugu
Follow us on
Vastu Sashtra: ఈ రోజుల్లో ఎక్కువ మందిలో మనశ్శాంతి లోపిస్తోంది. ఉద్యోగ బాధ్యతలు పెరగటం వల్ల, సంపాదన పెంచుకోవాలనే తాపత్రయం వల్ల, ఇంకా రకరకాల కారణాలవల్ల మానసికమైన ఒత్తిళ్లు, టెన్షన్లు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా బీపీలు, షుగర్లు శరీరంలో ప్రవేశించేస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడం, ఆందోళన చెందడం, నిరాశ నిస్పృహలకు లోనుకావటం వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటికి వాస్తు పరంగా నిపుణులు కొన్ని ఆచరణ యోగ్యమైన నివారనోపాయాలు సూచించారు.
ప్రధాన కారణాలు
సొంత ఇంట్లో కానీ, అద్దె ఇంట్లో కానీ వాయువ్య మూల సరిగ్గా లేని పక్షంలో ఆ ఇంట్లో తప్పకుండా మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాయువ్య మూల ఏ కొద్దిగా పెరిగినా ఆ ఇంటి వారిని నిరాశ నిస్తృహలు ఆవరిస్తాయి. ప్రతి చిన్న విషయానికి కంగారు పడటం, ఆందోళన చెందటం ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంట్లోని వారు తరచూ డిప్రెషన్ లోకి జారిపోవడం జరుగుతుంటుంది. సాధారణంగా ఇంటి యజమానికి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. మానసికంగా స్థిరత్వం కోల్పోయే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఒక పట్టాన పూర్తి కావు.
వాయవ్యంతో పాటు, ఆగ్నేయ మూల కూడా పెరిగిన పక్షంలో ఆ ఇంట్లోని వారి బాధలు చెప్పనలవి కాదు. ఆ ఇంట్లోని వారు ఎప్పుడు చూసినా మానసిక సమస్యలతో అవస్థలు పడుతుంటారు.
ముఖ్యమైన పరిహారాలు
ఈశాన్య మూల కన్నా వాయువ్య, ఆగ్నేయ మూలలు పెరిగి ఉండటం ఆ ఇంట్లోని వారి మనశ్శాంతిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈశాన్యంలో పెరిగి ఉండటం మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఈశాన్య మూల ఏమాత్రం దెబ్బతిన్నప్పటికీ ఆ ఇంట్లోని వారు ముఖ్యంగా ఆ ఇంటి యజమాని మానసిక సమస్యలతో లేదా టెన్షన్లతో ఇబ్బంది పడుతుంటారు.
1. ఈశాన్య మూలను తప్పనిసరిగా పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం ఉంది.
2. ఈశాన్య మూలలో టాయిలెట్, సెప్టిక్ ట్యాంక్, స్టోర్ రూమ్, విరిగిన వస్తువులు, చివరికి చెత్త బుట్ట ఉండటం కూడా శ్రేయస్కరం కాదు. వాటిని వెంటనే తొలగించడం మంచిది.
3. ఈశాన్యంలో ఒక నీటి కుండ గానీ, నీటి తొట్టె గానీ ఏర్పాటు చేయడం మంచిది. ఈ మూలలో ఏదో విధంగా నీరు ప్రవహించడం వల్ల ఇంట్లోని వారి మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
4. ఈ మూలలో స్నానాల గది ఉంటే మరీ మంచిది. మొక్కను నాటినా మంచి ఫలితం ఉంటుంది.
5. ఈ మూలలో దేవుడి బొమ్మ గానీ, పూజా మందిరం కానీ ఉంటే ఆ ఇంట్లోని వారికి మానసిక ఒత్తిళ్లు కానీ, టెన్షన్లు గానీ, దిగులు కానీ ఉండవు. మానసికంగా ఎంతో బలంగా, స్థిరంగా ఉండటా నికి అవకాశం కలుగుతుంది.
నైరుతికి ప్రాధాన్యం
ఈశాన్యం తర్వాత మానసిక ఆరోగ్యం విషయంలో నైరుతి మూలకి కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈశాన్య మూలను పెంచడానికి వీలు లేనప్పుడు నైరుతిని వాస్తుకు తగ్గట్టుగా ఉంచడానికి ప్రయత్నించడం మంచిది. నైరుతి మూల ఎంత పరిశుభ్రంగా ఉంటే మానసిక ఆరోగ్యానికి అంత మంచిది. అందువల్ల నైరుతి మూలలో మాస్టర్ బెడ్ రూమ్ ఉండాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఆ ఇంటి యజమాని లోనే కాక కుటుంబ సభ్యులలో కూడా నాయకత్వ లక్షణాలు పెరిగి మానసిక ధైర్యం, స్థైర్యం కలుగుతాయి. మానసిక దిగుళ్లు దూరం అవుతాయి. ప్రతి పనిలోనూ విజయాలను చవిచూడటం జరుగుతుంది.
అయితే, దక్షిణ దిశలో కానీ, నైరుతి మూలలో కానీ పొరపాటున కూడా దేవుడి బొమ్మను లేదా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవద్దు. దీనివల్ల ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురై మనశ్శాంతి కొరవడుతుంది. వీటిని వెంటనే ఈశాన్య మూలకు తరలించడం మంచిది. ఇక నైరుతి మూలలో నీలం రంగు ఉండటం మానసిక ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. అక్కడి గోడలకు నీలం రంగు వేయటం కానీ, అక్కడ నీలం బల్బును ఏర్పాటు చేయడం కానీ జరగకూడదు. మొత్తం మీద ఈ చిట్కాలు పాటించే పక్షంలో మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది.

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..