వారణాసిలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా కాశీ విశ్వనాథ ఆలయ సముదాయంలోని భారత మాత విగ్రహం సమీపంలో గల మాంధాతేశ్వర్ మహాదేవ్ ఆలయంపై పిడుగు పడింది. పిడుగు దాటికి ఆలయ శిఖరంపై గల కలశం ధ్వంసమైంది. పిడుగుపాటు కారణంగా శిఖరం పైభాగం దెబ్బతింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం క్షీణించింది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో భారీ వర్షంతో మెరుపులు మెరిశాయి. ఆ సమయంలో కాశీ విశ్వనాథ ధామ్, సమీపంలోని ఆలయాలలో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. బాబా మాంధాతేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆరతికి సమయం దగ్గరపడింది. పూజారులు హారతి కోసం అంతా సిద్ధం చేశారు. అంతలోనే పెద్ద శబ్దంతో బాబా మాంధాతేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎగువ శిఖరంపై పిడుగు పడింది. పిడుగు ధాటికి ఆలయం ఎగువ శిఖరం దెబ్బతింది. గుడి ఆవరణలో చుట్టూ పిడుగుపాటు కారణంగా శిఖరం రాళ్లు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. కానీ, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం సంభవించకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు, ఆలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై శిథిలాలను తొలగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి