
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ మంచి అవకావం కల్పిస్తోంది. స్వామివారిని దర్శించుకునేందుకు తరచూ లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. వీరిలో రోజూ 80 వేల మంది వరకు టీటీడీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తోంది. కొంతమంది ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లను బుక్ చేసుకుని వస్తుండగా.. మరికొంతమంది తిరుపతిలో టైం స్లాట్ దర్శనం టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్తున్నారు. ప్రతీనెలా టీటీడీ ఆన్‌లైన్‌లో తర్వాతి నెలలకు సంబంధించిన దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తూ ఉంటుంది. కానీ రిలీజ్ చేసి కొద్ది సేపటికే ఇవన్నీ బుక్ అయిపోతాయి. దీంతో చాలామందికి దర్శనం టికెట్లు దొరక్క నిరాశ చెందుతున్నారు. ఇలాంటివారికి టీటీడీ మరో అవకాశం కల్పిస్తోంది.
స్వామివారిని దర్శించుకోవాలనునే భక్తుల కోసం టీటీడీ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తోంది. ఈ హోమం టికెట్ రూ.1600 ఉంటుంది. ఇది తీసుకుంటే ఇద్దరు వ్యక్తులు హోమంలో పాల్గొనవచ్చు. అంతేకాకుండా హోమం పూర్తైన తర్వాత రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఉచితంగా వెళ్లవచ్చు. ప్రతీ నెలా ఈ హోమానికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ జారీ చేస్తోంది. ఏప్రిల్ నెల టికెట్లను మార్చి 25వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ టికెట్లను బుక్ చేసుకుంటే హోమంలో పాల్గొనడంతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితంగా లభిస్తుంది. ఈ టికెట్లను పొందినవారికి హోమం పూర్తైన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తారు.
రూ.300 దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో దొరక్కపోతే ఈ విధానంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. చాలామందికి ఈ విషయం తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. భక్తుల్లో చాలామందికి దీని గురించి అవగాహన లేదు. దీంతో భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ సూచిస్తోంది. ఈ హోమం అలిపిరిలోని సప్తగోప్రదక్షిణశాలలో జరుగుతుంది. కాగా ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 దర్శనం, ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్, అంగ ప్రదక్షిణ టికెట్లను టీటీడీ ప్రస్తుతం విడుదల చేస్తోంది. అటు ఒంటిమిట్టలో ఏప్రిల్ 1వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి టీటీడీ ఏర్పాట్లలో మునిగిపోయింది. అలాగే వార్షిక బ్రహ్మెత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల ఏర్పాట్లను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వేసవి కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.