
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమలలో మరిన్ని ఉచిత బస్సులు అందుబాటులోకి వచ్చాయి. 32 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా టీటీడీ అందుబాటులోకి వచ్చింది. ఇవి తిరుమలలో భక్తులకు ఉచితంగా సేవలు అందిస్తాయి. దర్శనం కోసం వెళ్లే భక్తులతో పాటు తిరుమలలో పర్యటించేవారు వీటిల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. తిరుమల- నారాయణగిరి సర్కిల్ వద్ద రిలయన్స్ ఫౌండేషన్, భారత్ బయోటెక్ అందించిన ఎలక్ట్రిక్ బస్సులను బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తిరుమలలో భక్తుల సేవలందించేందుకు గానూ 25 ఈవీ బస్సులను రిలయన్స్ ఫౌండేషన్ విరాళంగా ప్రకటించింది. మరో 7 బస్సులను భారత్ బయోటెక్ సంస్థ అందించింది. ఈవీ బస్సులతో పాటు ఛార్జింగ్ స్టేషన్లను టీటీడీకి రిలయన్స్ ఈవీ న్యూమొబిలిటీ సీఈఓ నితిన్ సేథ్, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా అందించారు. ఈ ఏడాది జూన్‌లో తిరుమల సందర్శన సందర్భంగా భక్తుల సౌకర్యార్ధం టీటీడీకి 25 ఈవీ బస్సులు ఇస్తామని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ హామీ ఇచ్చారు. దీంతో ఆ హామీ మేరకు బస్సులను ఇప్పుడు ఉచితంగా అందించారు. దీంతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు,ఈవో రవిచంద్రలతో కలిసి 32 ఈవీ బస్సుల్ని సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు.
బస్సులను ప్రారంభించిన అనంతరం ఓ ఈవీ బస్సులో నారాయణగిరి సర్కిల్ నుంచి మ్యూజియం వరకూ చంద్రబాబు ప్రయాణించారు. సీఎం వెంట ఈవీ బస్సులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రిలయన్స్ ఈవీ మొబిలిటీ సీఈఓ నితిన్ సేథ్, సుచిత్రా ఎల్లా, టీటీడీ ఈవో రవిచంద్ర తదితరులు ప్రయాణించారు. ప్రస్తుతం తిరుమలలో కొన్ని బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీకి బస్సులు సరిపోవడం లేదు. దీంతో ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు భక్తులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో.. తర్వాతి బస్సు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ బాధలు తప్పనున్నాయి.
తిరుమలలో ఎస్వీ మ్యూజియంనుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవోలతో కలిసి ఎస్వీ మ్యూజియంలో విశేషాలను పరిశీలించారు. శ్రీవారి మహత్యం, తిరుమల విశిష్టతలను తెలిపేలా మ్యూజియంలో వివిధ అంశాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు సహా వివిధ సందర్భాల్లో శ్రీవారికి సమర్పించిన ఆభరణాల నమూనాలు, చారిత్రక అంశాలను తెలిపేలా మ్యూజియంలో వస్తు ప్రదర్శన ఏర్పాటు చేశారు. శ్రీవారికి ధరింప చేసే వివిధ కిరీటాలు, ఆభరణాలను త్రీడీ మోడల్ లో చిత్రీకరించి వాటిని ప్రదర్శించేలా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. మ్యూజియంలోని పానోరమిక్ స్క్రీన్ పై ఏఐ వీడియో ద్వారా శ్రీవారి పరిణయ విశేషాల ప్రదర్శనను చంద్రబాబు తిలకించారు. తిరుమల కొండపై వివిధ ఆలయాలు, శిల్పాలు, ప్రకృతి ఏర్పాటు చేసిన భౌగోళిక విశిష్టతలను తెలిపేలా మ్యూజియంలో ప్రదర్శన టీటీడీ ఏర్పాటు చేసింది.