
వేదాంగ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెల నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. మూఢం ముగియనుండటంతో శుభ కార్యాలకు శ్రీకారం చుట్టవచ్చని పండితులు చెబుతున్నారు. వివాహం, దాంపత్య సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఐశ్వర్యానికి ప్రధాన కారక గ్రహం శుక్రుడు. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండి అస్తమయ (మౌఢ్య) స్థితిలో ఉన్న సమయంలో శుక్రుడు శుభ ఫలితాలు ఇవ్వలేడని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ కారణంగా శుక్ర మౌఢ్యమి కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు అనుకూలత ఉండదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
శుక్ర మౌఢ్యమి 2026 ఫిబ్రవరి 17న ముగుస్తుంది. ఆ రోజుతో శుక్రుడు అస్తమయ స్థితి నుంచి బయటపడి, మళ్లీ శుభ ఫలితాలు ఇవ్వగల స్థితిలోకి ప్రవేశిస్తాడని పంచాంగాలు తెలియజేస్తున్నాయి.
శుభ ముహూర్తాలు ఫిబ్రవరి 18, 2026 నుంచి తిరిగి ప్రారంభమవుతాయి. ఈ తేదీ నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, నూతన గృహారంభాలు, ఇతర శుభసంకల్ప కార్యాలను నిర్వహించుకోవచ్చని జ్యోతిషులు సూచిస్తున్నారు. ఫిబ్రవరి 18 నుంచి మే 9 వరకు శుభ ముహూర్తాలు లభిస్తాయి.
మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉండటం వల్ల ఆ కాలంలో ముహూర్తాలు ఉండవు. అనంతరం నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ నెలలో గురుబలం తోడవడంతో మళ్లీ శుభ ముహూర్తాలు అందుబాటులోకి వస్తాయి.
గృహారంభం విషయంలో మే 4 నుంచి 29 వరకు కర్తరీ దోషం ఉన్నట్లు పంచాంగ కర్తలు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో రవి భరణీ నక్షత్రం 3, 4 పాదాలు, కృత్తిక 4వ పాదం, రోహిణి మొదటి పాదంలో సంచరిస్తుండటంతో గృహప్రవేశాలు, గృహారంభాలు, చెట్లు నరకడం, బావులు లేదా చెరువులు తవ్వడం వంటి పనులు చేయరాదని సూచిస్తున్నారు.
శుక్ర మౌఢ్యమి ముగిసినప్పటికీ తిథి, నక్షత్రం, వార దోషాలు, వ్యక్తిగత జాతక పరిస్థితులను పరిశీలించి ముహూర్తం నిర్ణయించుకోవడం శుభ ఫలితాలకు దోహదం చేస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. శుక్ర మౌఢ్యమి అనంతరం దాంపత్య జీవితం, కుటుంబ సుఖసంతోషాలు, గృహ శాంతి, ఐశ్వర్యం బలపడతాయని ముహూర్త శాస్త్రం పేర్కొంటోంది.
ఇప్పటికే ఆలస్యమైన వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను ఫిబ్రవరి 18, 2026 తర్వాత శాస్త్రోక్త ముహూర్తాల్లో నిర్వహించుకోవడం మంచిదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)