
Shani Puja: శని త్రయోదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దినం. శనిగ్రహ అనుగ్రహం కోసం ఈ రోజున చేసే చిన్న ప్రార్థన కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం చేసే పూజా విధానం జీవితంలోని కష్టాలను తగ్గించి, స్థిరత్వం, శాంతిని ప్రసాదిస్తుంది. శనిదేవుడు కర్మఫల దాత. మనం చేసిన కార్యాల ప్రకారమే ఫలితాలను అందించే దేవుడు శని. అందుకే శనిని భయపడాల్సిన అవసరం లేదు.. భక్తితో, నియమంతో ఆరాధిస్తే ఆయనే మనకు సకల శుభాలను అందించే మార్గదర్శకుడు అవుతారు. ఈ రోజు చేసే పరిహారాలు, దానాలు రెట్టింపు ఫలితాన్ని అందిస్తాయని పండితులు చెబుతారు. ఈరోజు సాయంత్రం 5.15-5.45 గంటల మధ్య శివునికి అభిషేకం చేస్తే శని పీడల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది. గుడికి వెళ్లలేనివారు ఇంట్లోనే పడమర దిక్కున నువ్వుల నూనెతో 8 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగిస్తే ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి.
సూర్యాస్తమయం తర్వాత శుభ్రంగా స్నానం చేసి, నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీపం ముందు శనిదేవుని స్మరించుకుంటూ కూర్చోవాలి.
కనీసం 11 లేదా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి:
“ఓం శం శనైశ్చరాయ నమః”
ఈ మంత్ర జపం మనసుకు స్థిరత్వాన్ని ఇచ్చి, నెగెటివ్ ప్రభావాలను తగ్గిస్తుంది.
నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, ఇనుము, నూనె లేదా ఆహారం అవసరమైన వారికి దానం చేయండి. దానం ద్వారా శని దోషం శమిస్తుందని విశ్వాసం.
శనిదేవునికి అత్యంత ప్రియమైనవారు శివుడు, హనుమంతుడు. శని త్రయోదశి రోజున హనుమాన్ చాలీసా చదవడం లేదా హనుమంతుని దర్శించుకోవడం చాలా శుభకరం. అంతేగాక, ఈరోజు సాయంత్రం సమయంలో శివుడికి అభేషకం చేయడంతో ఉత్తమ ఫలితాలు పొందుతారు.
అనవసరమైన మాటలు, కోపం, చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ రోజు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యము.
శని మనకు నేర్పే గొప్ప పాఠం.. ఓర్పు, నిజాయితీ, క్రమశిక్షణ. తక్షణ ఫలితాలు కాకుండా.. దీర్ఘకాలిక మేలు కోసం శని మన జీవితాన్ని తీర్చిదిద్దుతాడు. కష్టాలు వస్తే శిక్షగా కాకుండా, మనల్ని మెరుగుపరచే అవకాశంగా చూడాలి. ఈ శని త్రయోదశి మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, ఆధ్యాత్మిక బలం నింపాలని కోరుకుంటూ… శనిదేవుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండుగాక.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)