
ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరకు తెర లేచింది. సమ్మక్క, సారక్క జాతర కనుల పండువగా సాగుతోంది. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. అయితే ముందు నుంచే భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గద్దెల దగ్గర భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. మహా జాతరకు వారం రోజుల ముందు నుంచి భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ మహా జాతరలో న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగకు చెందిన గిరిజనులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. న్యూజిలాండ్ గిరిజనుల హాకా నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అటు.. సమ్మక్క-సారక్కను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి సంబరపడిపోయారు.
ములుగు జిల్లా మేడారంలో అంతర్జాతీయ వైభవం నెలకొంది. న్యూజిలాండ్‌కు చెందిన మావోరీ తెగ గిరిజనులు మేడారం చేరుకుని సమ్మక్క-సారక్క వనదేవతలను దర్శించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిరిజన సంప్రదాయాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఈ ఘట్టం మారింది. సమ్మక్క–సారక్క దేవతలపై భక్తితో మావోరీ గిరిజనులు వనదేవతల సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తమ సంప్రదాయాలు, విశ్వాసాలకు దగ్గరగా ఉన్న మేడారం మహా జాతరను దర్శించుకోవడం తమకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా.. మావోరీ గిరిజనులు తమ సాంప్రదాయమైన హాకా నృత్యాన్ని ప్రదర్శించారు.
వనదేవతల సన్నిధిలో సాగిన ఈ హాకా నృత్య ప్రదర్శన అక్కడున్న భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. నినాదాలు, శరీర కదలికలతో కూడిన ఈ నృత్యం.. మేడారం జోష్ నింపింది. అంతకుముందు.. న్యూజిలాండ్ గిరిజనులకు మంత్రి సీతక్క ఘనస్వాగతం పలికారు. గిరిజన సంస్కృతులు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఆత్మతో ముడిపడి ఉంటాయనడానికి ఈ సందర్శనే నిదర్శనమని తెలిపారు. మావోరీ గిరిజనుల రాక మేడారానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చిందన్నారు. మేడారంలో హాకా సాంప్రదాయ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో దేశవిదేశాల గిరిజన సంస్కృతుల సంగమానికి ఈ వేదిక సాక్షిగా నిలిచింది. సమ్మక్క-సారక్క మహాజాతర అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందనడానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది.
వీడియో చూడండి..
మరిన్ని ఆథ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..