Medaram Maha Jatara 2022 Heavy Rush: ఇక జాతరకువచ్చే భక్తుల ప్రయాణతీరు చూస్తే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. మేడారం జాతర వెళ్లడానికి ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అటునుంచి ఎడ్లబండ్లపై బయలుదేరి దారిపొడుగునా మజిలీలుచేస్తూ జాతర నాటికి మేడారం చేరుకుంటారు పలువురు భక్తులు. మేడారంలో గుడారం ఏర్పాటు చేసుకుని నాలుగురోజులూ అమ్మల ఒడిలో సేదతీరుతారు. ఈ సమయంలో తమ కుటుంబసభ్యులతో సహా గద్దెల వద్దకు రావడం, అమ్మవార్లను దర్శించుకునే సమయంలో ఎక్కడా ఎవరూ తప్పిపోకుండా తమ కుటుంబసభ్యుల బృందానికి ఓ గుర్తుగా జెండాలు పట్టుకుని తిరుగుతారు. ఓ చేతికర్రకు జెండాను కట్టి జాతరలో తిరుగుతుంటే తమవారు ఎక్కడ తప్పిపోయినా సులువుగా గుర్తుపట్టవచ్చన్న భక్తజనం తీరు ఆసక్తిగొలుపుతుంది. ఇది ఇవాళ్టి ముచ్చట కాదు.. అనాదిగా జాతరకు వచ్చే భక్తుల వ్యవహారమే. ఇక జాతరకు వచ్చిన వారు జంపన్నవాగులో చెలిమెలు తీసి అక్కడే ఓ రాయిని చేసి పసుపుకుంకుమలతో పూజించి చెట్టుకొమ్మలను ఉంచి సమ్మక్కతల్లిగా ఆరాధిస్తారు. సమ్మక్క జాతరకు పదిహేను రోజుల ముందు నుంచి ఇంటింటా సమ్మక్కను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తరహా సంప్రదాయం మరే జాతరలోనూ కనిపించదు.
రెండేళ్లకోసారి వచ్చే ఆ నాలుగు రోజులు.. మేడారం పరిసరాలను మహానగరంగా మార్చేస్తాయి. జనపూనకాలతో వనస్థలిని ఊపేస్తాయి. సుమారు కోటిమందిని తల్లుల చెంతకు చేరుస్తాయి. గూడెపు గుండెభాష వినిపిస్తూ ఆదివాసీ ఆంతర్లోకాన్నీ ప్రపంచానికి పట్టి చూపుతాయి. దండకారణ్య ద్వారాన్ని జనారణ్యం చేస్తాయి. తెలంగాణలోని అన్ని జాతరలోలాగానే ఇక్కడ కూడా సామూహికతే అసలు లక్షణం. వాస్తవానికి మేడారం ఓ కుగ్రామం. కనీసం గ్రామ పంచాయతీ కూడా కాదు. ఊరట్టం గ్రామపంచాయతీలో అది అంతర్భాగం.కానీ, జాతర జరిగే నాలుగు రోజులూ ప్రతి చెట్టూ గుట్టా ఉసిళ్లపుట్టల్లా జనమే జనం. మేడారం మోడ్రన్‌హబ్‌గా మారిపోతుంది. ఎడ్లబండ్ల నుంచి హెలికాప్టర్ల దాక అన్నీ అక్కడ కనిపిస్తాయి. ల్యాప్‌టాప్‌లు.. డిజిటల్ స్క్రీన్లు..ఇగ్లూస్..భుటానీస్.. ఇలా అధునాతన సౌకర్యాలన్నీ వచ్చి చేరుతాయి. అత్యాధునిక వాహనాలను అక్కడ చూడొచ్చు. మొబైల్ కవరేజ్‌తోపాటు త్రీజీ సేవలూ అందుబాటులోకి వస్తాయి. అయితే అవన్నీ ఆ నాలుగు రోజులే. జాతర ముగియగానే మేడారం తనలోకి తానే ముడుచుకుపోతుంది. మళ్లీ కారడవిలో కుగ్రామమైపోతుంది.
Read Also…