Maha Kumbh 2025: ఆధ్యాత్మిక సంగమంలో ఇసుకేస్తే రాలనంత భక్తజనం.. కుంభమేళాకు తరలివస్తున్న విదేశీయులు

|

Jan 14, 2025 | 9:21 PM

కుంభమేళా జరుగుతున్న త్రివేణీ సంగమ తీరం భక్తకోటితో నిండిపోయింది. కనుచూపుమేర ఎటుచూసినా భక్తుల పుణ్యస్నానాలే. నిన్న కోటి 75 లక్షల మంది వస్తే.. ఇవాళ రెండు కోట్ల మంది వచ్చారు. ఇదే రద్దీ రేపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా.. విదేశీయులు సైతం కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఆధ్యాత్మిక సంగమం ఒక విశ్వ సంబరంగా మారింది.

Maha Kumbh 2025: ఆధ్యాత్మిక సంగమంలో ఇసుకేస్తే రాలనంత భక్తజనం.. కుంభమేళాకు తరలివస్తున్న విదేశీయులు
Mahakumbh
Follow us on

నదీ స్నానం సర్వ పాప హరణం అంటోంది హిందూ ధర్మశాస్త్రం. అందులోనూ పరమ పవిత్రమైన గంగా నది, తోడుగా యమున, అంతర్వాహినిగా సరస్వతి ఒకేచోట సంగమించే ప్రదేశంలో నదీ స్నానం ఆచరించడం జన్మజన్మల పాపాలను హరిస్తుందనేది హిందువుల విశ్వాసం. పైగా.. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా ఇది. ఇప్పుడు మిస్‌ అయితే.. మళ్లీ ఇలాంటి మహా కుంభమేళాలో పాల్గొనడం దాదాపుగా అసాధ్యం. అందుకే.. పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. అందులోనూ, మకర సంక్రాంతి పుణ్యతిథి కావడంతో.. వివిధ వర్గాలకు చెందిన 13 అఖాడాలు మహాకుంభమేళాకు వచ్చాయి. ఈ అఖాడాలు తెల్లవారుజామున 3 గంటలకు బ్రహ్మముహూర్తంలో అమృత స్నానాలు ప్రారంభించారు.

మంగళవారం రోజున ఉదయం 10 గంటల కల్లా కోటి 38 లక్షల మంది స్నానాలు చేసినట్టు లెక్కగట్టిన అధికారులు.. మధ్యాహ్నం 12 గంటలకు కోటి 60 లక్షల మందికిపైగా భక్తులు అమృత స్నానాలు ఆచరించినట్లు మహా కుంభమేళా అధికారులు ప్రకటించారు. ఈ లెక్కన రెండోరోజున కనీసం 2 కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించి ఉంటారని అంచనా వేస్తున్నారు. దాదాపు 10 వేల ఎకరాల కుంభనగర్‌లో ఎటుచూసినా భక్తగణమే కనిపిస్తున్నారు. సంక్రాంతి తరువాత వచ్చే పుణ్య తిథి.. ఫిబ్రవరి 3వ తేదీన వచ్చే వసంత పంచమి. ఆ రోజు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విదేశీయుల గురించి. సామాన్యులు, సాధువులు, అఖాడాలతో కలిసి పుణ్యస్నానం ఆచరించేందుకు అమెరికా, యూరప్‌, ఇతర దేశాల నుంచి తరలి వస్తున్నారు. బహుశా తాము గత జన్మలో భారత్‌లో పుట్టి ఉంటామంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయడం తమకు దక్కిన వరం అని సంబరపడిపోతున్నారు ఫారెనర్స్‌. పైగా.. ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా చేసింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. ఈసారి 40 కోట్ల మంది వస్తారనే అంచనాలతో.. అంతకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ఇక సంధ్యాసమయంలో త్రివేణీ సంగమం ఘాట్‌ వద్ద నదీమతల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..