Khairatabad Ganesh: 1954 లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 1 అడుగు విగ్రహం.. దేశంలో ఎత్తైన గణేష్ విగ్రహంగా ఎలా మారిందంటే..

Vinayaka Chavithi-Khairatabad Ganesh: హిందువులు తాము తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా జరగాలంటూ మొదటి పూజను వినాయకుడికి చేస్తారు.  భాద్రపద చవితి రోజున వినాయక పుట్టిన రోజు ఘనంగా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా జరిగే..

Khairatabad Ganesh: 1954 లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 1 అడుగు విగ్రహం.. దేశంలో ఎత్తైన గణేష్ విగ్రహంగా ఎలా మారిందంటే..
Vinayaka Idol

Updated on: Sep 09, 2021 | 8:08 PM

Vinayaka Chavithi-Khairatabad Ganesh: హిందువులు తాము తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా జరగాలంటూ మొదటి పూజను వినాయకుడికి చేస్తారు.  భాద్రపద చవితి రోజున వినాయక పుట్టిన రోజు ఘనంగా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ వేడుకల్లో మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు ప్రసిద్ధి. ఇక హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడి కోసం పిల్లలు పెద్దలు ఎదురుచూస్తారు అంటే అతిశయోక్తి కాదు.. వ క్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రభ ! నిర్విఘ్నం కురుమే దేవ ! సర్వ కార్యేషు సర్వదా.. అంటూ ఎంతో భక్తిశ్రద్దలతో కొలిచే వినాయక పర్వదినం అనగానే.. కళ్లముందు కదలాడే భారీవిఘ్నేశ్వరుడు ఖైరతాబాద్‌ గణేషుడు.

68 ఏళ్లుగా నిరాటంకంగా ఇక్కడ గణేష్‌ ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు మన ఎదుట నిలబడ్డాడా అనిపించే రూపం కనువిందు చేస్తుంది. ప్రతీ ఒక్కరినీ భక్తిలో లీనమయ్యేలా చేస్తుంది. ఈ 11 రోజులు ఖైరతాబాద్‌ ప్రాంతం.. ఆధ్యాత్మికతో విరాజిల్లుతుంది. ఓ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తలపిస్తుంది.  కరోనా ప్రభావం తీవ్ర ప్రభావం చూపడంతో.. గత ఏడాది నామమాత్రంగా గణేష్‌ ఉత్సవాలను నిర్వహించారు. 9 అడుగుల గణపయ్యను ఏర్పాటుచేసి ఉన్నచోటనే నిమజ్జనంచేసేలా చూశారు. ఈసారి మాత్రం భక్తుల కోరిక మేరకు 40 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువున్న వినాయకుడిని నిలబెట్టారు. శ్రీ పంచముఖ రుద్ర గణపతిగా ఖైరతాబాద్‌ బొజ్జగణపయ్య భక్తులకు దర్శనమిస్తున్నాడు.కోవిడ్‌ నిబంధనలు పాటించేలా ఈసారి ఐదురోజుల ముందు నుంచే దర్శించుకునేలా గణేషుడిని సిద్దం చేశారు నిర్వాహకులు. దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠల శర్మ సూచన మేరకు కరోనా తగ్గాలని, ప్రజలను కాపాడాలని శివుడి రుద్ర అవతారమైన పంచముఖ రుద్ర మహాగణపతిగా ఈసారి నామకరణం చేశారు. మహాగణపతి కుడివైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటుచేశారు.

1954లో ఒక్క అడుగు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. ప్రతీ ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ వచ్చారు. 2014లో 60 అడుగుల ఎత్తులో షష్టిపూర్తి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాక.. ఆ తర్వాత నుంచి ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వస్తున్నారు. 2019లో దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఇక్కడి విగ్రహం.. అరుదైన గుర్తింపు సాధించింది. 61 అడుగుల ఎత్తులో.. శ్రీద్వాదశ ఆదిత్య మహాగణపతిగా స్వామి దర్శనమిచ్చారు. 12 తలలు, 24 చేతులు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. సూర్యరథంపై కొలువయ్యాడు. వినాయక చవితి అంటేనే… నగరమంతా సందడి నెలకొంటుంది. ముఖ్యంగా ఖైరతాబాద్‌ ప్రాంతం.. భక్తుల కోలాహలంతో నిండిపోయి కనిపిస్తుంది. 11 రోజుల పాటు ఓ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తలపిస్తుంది ఈ ప్రాంతం. ఆధ్యాత్మిక వాతావరణంలో విరాజిల్లుతుంది.  ఖైరతాబాద్ లడ్డూ ప్రసాదానికి కూడా ప్రసిద్ధి చెందింది . 2015 లో స్వామివారికి సమర్పించిన లడ్డూ బరువు 6,000 కిలోలు..  దీనిని చూడటానికి పాకిస్తాన్ నుండి ప్రజలు కూడా వచ్చారు.

Also Read: వినాయక చవితి జరుపుకుంటే చదువు వస్తుంది.. ఉత్సవాలకు అనుమతి ఇవ్వమని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరు చిన్నారులు..