జ్యోతిర్లింగాల దర్శనం తర్వాత మీకు ఇలా అనిపిస్తుందా.. మీ శరీరంలో జరిగే ఆసలు మ్యాజిక్ ఇదే..

జ్యోతిర్లింగాలను దర్శించుకుని రాగానే శరీరం హఠాత్తుగా బరువుగా అనిపించడం, తీవ్రమైన అలసట రావడం మీరు ఎప్పుడైనా గమనించారా? దర్శనం పూర్తికాగానే ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇది కేవలం ప్రయాణపు అలసటేనా లేక దీని వెనుక ఆధ్యాత్మిక శక్తుల డిటాక్స్ ఏమైనా ఉందా? అనేది తెలిసుకుందాం..

జ్యోతిర్లింగాల దర్శనం తర్వాత మీకు ఇలా అనిపిస్తుందా.. మీ శరీరంలో జరిగే ఆసలు మ్యాజిక్ ఇదే..
Feeling Heavy Or Tired After Jyotirlinga Darshan

Updated on: Aug 01, 2026 | 1:53 PM

సనాతన ధర్మంలో 12 జ్యోతిర్లింగాలకు అత్యంత పవిత్రమైన, విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైల మల్లికార్జునుడు, మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వరం, ఉజ్జయిని మహాకాలేశ్వరుడు, మహారాష్ట్రలోని త్రియంబకేశ్వరం, ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుడు వంటి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే ఈ జ్యోతిర్లింగాల దర్శనం పూర్తయిన వెంటనే చాలామంది భక్తులకు అకస్మాత్తుగా శరీరం బరువుగా అనిపించడం, తీవ్రమైన అలసట లేదా ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక నమ్మకాలు, శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధ్యాత్మికవేత్తల ప్రకారం.. జ్యోతిర్లింగ క్షేత్రాలలో అత్యంత శక్తివంతమైన సానుకూల వైబ్రేషన్స్ ఉంటాయి. భక్తులు ఈ ఆలయాల్లోకి ప్రవేశించినప్పుడు, అక్కడి అత్యధిక ఆధ్యాత్మిక శక్తి శరీరం నుంచి ప్రతికూల ఆలోచనలను, ఒత్తిడిని, ప్రతికూల శక్తిని బయటకు తోసివేస్తుంది. ఈ డిటాక్స్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో తాత్కాలికంగా తలనొప్పి, అలసట లేదా శరీరం బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక శుద్ధీకరణ అని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.

మరోవైపు జ్యోతిర్లింగ యాత్రను భక్తులు ఒక తపస్సులా భావిస్తారు. స్వామివారి దర్శనానికి ముందు గంటల తరబడి ఉపవాసం ఉండటం, మైళ్ల దూరం కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం, తీవ్రమైన భక్తిశ్రద్ధలతో ధ్యానం చేయడం వల్ల శరీరంలోని శక్తి పరాకాష్టకు చేరుకుంటుంది. దర్శనం ముగిశాక శరీరం ఒక్కసారిగా విశ్రాంతి స్థితికి రావడంతో ఆ శక్తి సమతుల్యతలోని మార్పు వల్ల శరీరం బలహీనపడినట్లు లేదా నీరసించినట్లు అనిపిస్తుంది. ఆరోగ్య నిపుణులు దీనికి పూర్తి శాస్త్రీయ కారణాలు చూపుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం, సుదీర్ఘమైన ప్రయాణాలు చేయడం, సమయానికి సరైన ఆహారం, నిద్ర లభించకపోవడమే ఈ అలసటకు ప్రధాన కారణమని చెబుతున్నారు. దీనికి తోడు ఆలయ ప్రాంగణాల్లో, గర్భగుడుల్లో ఉండే అధిక రద్దీ, వేడి, తేమ కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గి నిర్జలీకరణం ఏర్పడుతుంది. తగినంత నీరు తాగకపోతే తీవ్రమైన నీరసం రావడానికి ఇది ముమ్మాటికీ కారణమవుతుంది.

ఇక కేదార్‌నాథ్ వంటి అత్యంత ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో ఉండే జ్యోతిర్లింగాలను దర్శించుకున్నప్పుడు వాతావరణంలో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీనిని ఆల్టిట్యూడ్ సిక్ నెస్ అంటారు. కొండ ప్రాంతాల్లో గాలి పలచబడటం వల్ల భక్తులకు తల తిరగడం, వాంతులు కావడం, తీవ్రమైన అలసట రావడం అత్యంత సహజం. కొందరు దీనిని ఆధ్యాత్మికంగా భావించినప్పటికీ, శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్లే ఇలా జరుగుతుంది. మొత్తానికి జ్యోతిర్లింగ దర్శనం తర్వాత కలిగే ఈ శారీరక మార్పుల వెనుక ఆధ్యాత్మిక కారణాలతో పాటు ఆచరణాత్మకమైన, వైద్యపరమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అందుకే సుదీర్ఘమైన ఆలయ యాత్రలు చేసేటప్పుడు భక్తులు తగినంత నీరు తాగుతూ, శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇస్తూ, ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us