బీఏపీఎస్‌ పండితుడు స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం

బీఏపీఎస్‌ పండితుడు, తత్వవేత్త మహామహోపాధ్యాయ స్వామి భద్రేశ్‌దాస్‌కు ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. న్యూఢిల్లీలోని సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ ఆయనకు ‘వేదాంతవిద్యా-విశ్వగురు’ బిరుదును ప్రదానం చేసింది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలపై సంస్కృత భాష్యాలు రచించడంతో పాటు వేదాంతం, సంస్కృతం, భారతీయ జ్ఞాన సంప్రదాయాల విస్తరణకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం అందించారు.

బీఏపీఎస్‌ పండితుడు స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
Swami Bhadreshdas

Updated on: Aug 10, 2026 | 12:06 PM

 

బీఏపీఎస్‌కు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, తత్వవేత్త మహామహోపాధ్యాయ స్వామి భద్రేశ్‌దాస్‌కు ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. న్యూఢిల్లీలోని సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ ఆయనకు వేదాంతవిద్యా-విశ్వగురు అనే బిరుదును ప్రదానం చేసింది. ఆదివారం న్యూఢిల్లీలోని స్వామినారాయణ అక్షర్‌ధామ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ గౌరవాన్ని అందజేశారు.

వేదాంతం, సంస్కృత సాహిత్యం, భారతీయ జ్ఞాన సంప్రదాయాల అధ్యయనం, పరిశోధన, విస్తృత ప్రచారానికి స్వామి భద్రేశ్‌దాస్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించినట్లు యూనివర్సిటీ తెలిపింది.

ప్రస్థానత్రయిపై సంస్కృతంలో భాష్యాలు

వేదాంతంలోని మూడు ప్రధాన ఆధార గ్రంథాలైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలను కలిపి ప్రస్థానత్రయిగా పిలుస్తారు. ఈ మూడు గ్రంథాలపై స్వామి భద్రేశ్‌దాస్ శాస్త్రీయ సంస్కృత భాష్యాలను రచించారు.

ప్ర‌ముఖ్ స్వామి మహారాజ్ ప్రేరణతో రూపొందిన ఈ రచనలు ప్రస్థానత్రయిలోని మూడు ప్రామాణిక గ్రంథాలపై సమగ్ర సంస్కృత వ్యాఖ్యానంగా నిలిచాయని ప్రెస్ రిలీజ్ పేర్కొంది. మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో స్వామి భద్రేశ్‌దాస్ సంస్కృతం, వేదాంతం, భారతీయ జ్ఞాన సంప్రదాయాల అధ్యయనాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపింది.

ప్రముఖుల సమక్షంలో సత్కారం

ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, సంస్కృత పండితులు హాజరయ్యారు. ఉడుపిలోని పెజావర అధోక్షజ మఠానికి చెందిన శ్రీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ, సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీనివాస వర్కేడి, శ్రీ సోమనాథ్ సంస్కృత యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ సుకాంత కుమార్ సేనాపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రొఫెసర్ వి. నారాయణన్, ప్రొఫెసర్ ఓమ్నాథ్ బిమ్లీ, ప్రొఫెసర్ మురళీకృష్ణ, ప్రొఫెసర్ గణేశ్ టి. పండిట్ తదితర ప్రముఖ పండితులు హాజరయ్యారు.

అక్షర-పురుషోత్తమ దర్శనంపై కృషికి ప్రశంసలు

స్వామి భద్రేశ్‌దాస్ పాండిత్యాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. సంస్కృత ప్రస్థానత్రయి సంప్రదాయంలో అక్షర-పురుషోత్తమ దర్శనంకు శాస్త్రీయ రూపకల్పన చేయడంలో ఆయన చేసిన కృషిని సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీనివాస వర్కేడి ప్రస్తావించారు.

స్వామి భద్రేశ్‌దాస్ శాస్త్రీయ ప్రస్థానంలో ప్రముఖ్ స్వామి మహారాజ్ ఆశీస్సులు, మార్గదర్శకత్వంతో పాటు మహంత్ స్వామి మహారాజ్ అందిస్తున్న మార్గనిర్దేశం కీలక పాత్ర పోషించిందని ప్రొఫెసర్ సుకాంత కుమార్ సేనాపతి పేర్కొన్నారు.

ప్రొఫెసర్ వి. నారాయణన్ ఈ సందర్భంగా అధికారిక ప్రశంసా పత్రాన్ని చదివి వినిపించారు. దీనికి కార్యక్రమానికి హాజరైన వారు హర్షధ్వానాలతో స్పందించారు.

గురువులకు అంకితం

వేదాంతవిద్యా-విశ్వగురు గౌరవాన్ని స్వీకరించిన స్వామి భద్రేశ్‌దాస్.. ఈ సత్కారాన్ని భగవాన్ స్వామినారాయణ్, తన గురువులైన ప్రముఖ్ స్వామి మహారాజ్, మహంత్ స్వామి మహారాజ్ పాదపద్మాలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

వేదాంతం, సంస్కృతం, భారతీయ జ్ఞాన సంప్రదాయాల అధ్యయనంలో స్వామి భద్రేశ్‌దాస్ చేసిన కృషికి ఈ గౌరవం గుర్తింపుగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us