Sri Rama Navami Kalyanam: శ్రీరాముడి కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని ఎదురుచూస్తున్న భక్తకోటికి ఈ ఏడాది కూడా నిరాశే. కరోనా మహమ్మారి పుణ్యమాని.. ఈసారి కూడా రాములోరి కళ్యాణ దర్శన భాగ్యం కొద్దిమందికి మాత్రమే దక్కనుంది. ప్రసిద్ధ భద్రాద్రి రామాలయంతో పాటు అన్ని ఊళ్లలోని ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి. కరోనా మహమ్మారి కారణంగా దేవాలయాల్లోని అన్ని కైంకర్యాల మాదిరిగానే రాములోరి కళ్యాణాన్ని కూడా ఏకాంతంగానే నిర్వహిస్తామని భద్రాద్రి ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తులెవరూ భద్రాద్రికి రావొద్దని కోరారు. ఈసారి టీవీల్లోనే ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని కోరారు.
అది లోక కల్యాణం. లక్షలాధి మంది భక్తులు చూసి తరించాల్సిన అద్భుతమైన ఘట్టం. అంతటి విశిష్టత కలిగిన బ్రహ్మోత్సవాలు, కల్యాణ మహోత్సవాన్ని చూసే భాగ్యం ఈసారి భక్తులకు లేదు. భద్రాచలంలో కొలువైన శ్రీసీతారామచంద్రస్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు భక్తులు లేకుండానే జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగానే గరుడ ధ్వజ పటాన్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. రామాలయంలోని లక్ష్మీతాయరు అమ్మవారి దేవాలయంలో తెల్లని వస్త్రంపై గరుత్మంతుని చిత్రాన్ని గీసి ప్రత్యేక పూజలు చేశారు. అటుపై గరుత్మంతుని చిత్రపటానికి గరుడాదివాసంను ఆవాహనం చేశారు అర్చకులు.
ఏటా జరిగే రాముల వారి కల్యాణోత్సవం ఈసారి కరోనా కారణంగా నిబంధనలకు లోబడి నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. లక్షలాది భక్తులు వస్తే కరోనా వ్యాప్తి చెందుతుందనే కారణంతో ఈసారి ఏప్రిల్ 19నుంచి 30వరకు జరిగే అన్ని పూజలను రద్దు చేసారు. చివరకు ఈనెల 20జరిగే సీతారాముల కల్యాణం, 21న నిర్వహించే రామయ్య పట్టాభిషేక మహోత్సవానికి కూడా భక్తుల అనుమతిని రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ అగ్నిప్రతిష్ఠ, గరుడ పట ధ్వజారోహణం,చతుస్థానార్చనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సీతారామచంద్రస్వామి వారి కల్యాణానికి కోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తులు శ్రీరాముడికి అందజేశారు. ఈ కల్యాణ తలంబ్రాలను 4నెలల నుండి రెండు తెలుగు రాష్ట్రాలలోని 15 జిల్లాలలో వున్న 160 మండలాలకు చెందిన సుమారు 4 వేల మంది భక్తులు స్వయంగా ఎంతో భక్తిశ్రద్ధలతో తమ స్వంత పంట పొలాలలో రామనామ స్మరణల మధ్య రామ దీక్ష చేపట్టి,పండించిన వడ్లను గోటితో ఒలిచి శ్రీరాముడికి కానుకగా సమర్పించుకున్నారు. 250 కేజీల కోటి గోటి తలంబ్రాలకు రామాలయంలో ఈవో , అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ తలంబ్రాలను ముత్యాల తలంబ్రాలుతో పాటు ఈనెల 21 న జరిగే శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణ క్రతువులో వినియోగించనున్నారు.
గతేది నిర్వహించినట్లుగానే రామయ్య కళ్యాణాన్ని ఆలయంలోని నిత్య కళ్యాణ మండపం వద్ద నిర్వహించనున్నారు. రామయ్య కళ్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని పురస్కరించుకుని దేవస్థానం అధికారులు కళ్యాణ మండపాన్ని పుష్పాలతో అలంకరించారు. కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, భక్తులెవరూ భద్రాద్రికి రావొద్దని ఆలయ కోరారు. ఈసారి టీవీల్లోనే ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని కోరారు.