Ayodhya Ram Mandir: ఎప్పుడెప్పుడా అని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం జరగనున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఆ తర్వాత ఏంటి? అనేదే చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం ముగిశాక ఏం చేస్తారు? చేపట్టబోయే ఇతర పనులు ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రశ్నలకు తాజాగా రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా సమాధానం ఇచ్చారు. ప్రాణప్రతిష్ఠ ముగిసిన వెంటనే తాము ఆలయ నిర్మాణ పనుల్ని చేపడతామని, ఈ ఏడాది చివరికల్లా మందిరాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. “ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక మేము కొత్త ఉత్సాహంతో, నిబద్ధతతో జనవరి 23వ తేదీ నుంచే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. మొత్తం ఆలయాన్ని 2024 చివరికల్లా పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ఆలయ ప్రాంగణంలో మరో ఏడు ఉపఆలయాలు నిర్మించాల్సి ఉంది. రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం ముగిసిన వెంటనే.. వాటి నిర్మాణ పనుల్ని మొదలుపెడతాం’’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. ప్రతిష్ఠాపన కార్యక్రమాల ఏర్పాట్లపై మాట్లాడుతూ, దేశానికి ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ ఏర్పాట్లను ఉంటాయని అన్నారు. ఈ ఏర్పాట్లకు తాము ఎంతో ప్రాముఖ్యత ఇచ్చామని, ఎలాంటి తప్పులు దొర్లకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీదీ నిర్వహిస్తూ వచ్చామని మిశ్రా తెలిపారు.
ఇదిలావుండగా.. రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఈ శుభసందర్భం చరిత్రలో నిలిచిపోయేలాగా.. సంగీత కార్యక్రమం ‘మంగళ ధ్వని’తో పాటు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రారంభోత్సవానికి హాజరై.. మధ్యాహ్నం 12:15 గంటలకు రామాలయం గర్భగుడిలో పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ముగుస్తాయి. జనవరి 23వ తేదీ నుంచి సాధారణ భక్తులకు శ్రీరాముడిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. 2.7 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..