పొంగల్ తర్వాతే.. జైలు నుంచి చిన్నమ్మ బయటకు
జయ ఆస్తులపై చిన్నమ్మ పెత్తనం పోయింది. జయ ఆస్తులు ఆమె మేనకోడలు దీపకు వెళ్లాయి. శశికి చెందిన 300 కోట్ల ఆస్తులను ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అటాచ్ చేసింది. జైల్లో ఉన్నకాలంలో- పార్టీ పోయింది, ఆస్తులు పోయాయి, భర్త నటరాజన్ కూడా చనిపోయారు. శశికళకు ఒంటరిజీవితం మిగిలింది...

Sasikala To Be Released : శశికళ…ఈ పేరు వినగానే, జయలలితతో దశాబ్దాల ఆమె స్నేహం కళ్లముందు మెదులుతుంది. అమ్మకు ఆమె నెచ్చెలి. జయ మరణం శశికళ జీవితాన్ని మార్చేసింది. కాలం కొవ్వొత్తిలా కరిగిపోయింది. అప్పుడే నాలుగేళ్లు గడిచిపోయాయి. నాలుగేళ్ల జైలుశిక్ష తర్వాత ఆమె బయటకు వచ్చెదెన్నడు? ఈ ప్రశ్నపై ప్రజల్లో బాగా చర్చ నడిచింది.
ఆగస్ట్ 14నాడు ఆమె విడుదల అవుతుందని బీజేపీ తమిళనాడు నేత ఆశీర్వాదం చారి చేసిన ట్వీట్ ఆ రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టించింది. ఆ తర్వాత టి.నరసింహమూర్తి అనే న్యాయవాది ఆమె విడుదలపై RTI ద్వారా సమాచారానికి ప్రయత్నించారు. ఫలితంగా ఈ ప్రశ్నకు సమాధానం వచ్చింది. 2017 ఫిబ్రవరి 15 శశికళ జైల్లోకి వెళ్లారు. ఈ లెక్కన సుప్రీంతీర్పులో భాగమైన జరిమానా చెల్లిస్తే 2021 జనవరి 27న చిన్నమ్మ విడుదల అవుతారని పరప్పణ అగ్రహార జైలు అధికారులు తెలిపారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే ఫిబ్రవరి 27నాడు విడుదల అవుతారని రూల్స్ చెబుతున్నాయి. ఈ నాలుగేళ్లలో సెలవులు, సత్ప్రవర్తన కలుపుకుంటే 129 రోజుల మినహాయింపు వచ్చినట్లయింది.
తమిళనాడులో ఇప్పుడిప్పుడే ఎన్నికల వేడి మొదలవుతోంది. వచ్చే ఏడాది మే నెలలో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే జైలు నుంచి విడుదలయ్యాక శశికళకు గట్టిగా మూడునెలల సమయం ఉంటుంది. స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత- ఆమె ఏం చేస్తారన్నది కీలకంగా మారింది.
జయ మరణం తర్వాత నెలరోజుల్లోపే.. అంటే 2016 డిసెంబర్ 29 ఆమె అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2017 ఫిబ్రవరి 5న ఆమె అన్నాడీఎంకే ఎల్పీ నేతగా ఏకగ్రీవం అయ్యారు. కానీ అక్కడే ట్విస్ట్. ముఖ్యమంత్రిగా శశి ప్రమాణ స్వీకారాన్ని అప్పటి గవర్నర్ విద్యాసాగర్‌రావు అడ్డుకున్నారు. అక్రమాస్తుల కేసులో ఆమెపై కేసు ఉండటమే కారణం. మన్నార్‌గుడి మాఫియా అని ప్రచారం నడిచింది. అప్పుడే సుప్రీం తీర్పు ఇచ్చింది. ముఖ్యమంత్రి బంగళాలో ఉండాల్సిన శశికళ, జైలుకెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో జయలలిత సమాధిపై శశికళ చేతితో కొట్టి శపథం చేసిన సీన్ ఎవరూ మర్చిపోరు. కానీ- శశి జైల్లోకి వెళ్లగానే అన్నాడీఎంకే ఆమెను బహిష్కరించింది. ఆమె మేనల్లుడు దినకరన్ – అమ్మ మక్కల్ మున్నేట్ర కళగమ్ అనే పార్టీ పెట్టారు.
మరోవైపు- జయ ఆస్తులపై చిన్నమ్మ పెత్తనం పోయింది. జయ ఆస్తులు ఆమె మేనకోడలు దీపకు వెళ్లాయి. శశికి చెందిన 300 కోట్ల ఆస్తులను ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అటాచ్ చేసింది. జైల్లో ఉన్నకాలంలో- పార్టీ పోయింది, ఆస్తులు పోయాయి, భర్త నటరాజన్ కూడా చనిపోయారు. శశికళకు ఒంటరిజీవితం మిగిలింది.
ఇప్పుడు అన్నాడీఎంకే ఏం చేయబోతోంది? శశి ఉన్న దినకరన్ పార్టీతో పొత్తుపెట్టుకుంటుందా? తద్వారా బీజేపీ నుంచి ఎదురయ్యే సమస్యను అధిగమిస్తుందా? ఒంటరిగా పోరాడుతుందా? అన్నది కీలకంగా మారింది. అన్నాడీఎంకే నుంచి శశికళను దూరం చేసి, పన్నీర్-పళని వర్గాలు కలిసి, ప్రభుత్వం సుస్థిరంగా ఉండటానికి బీజేపీ అప్పట్లో చక్రం తప్పింది. ఆ బీజేపీని చూస్తే అన్నాడీఎంకేకు భయపడుతోంది.
అటువంటప్పుడు చిన్నమ్మతో చెలిమి ఉంటుందా? అన్నదే సస్పెన్స్. శశికళతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోకపోతే- చిన్నమ్మ ఎన్నోకొన్ని అధికారపార్టీ ఓట్లు చీల్చడం ఖాయం. ఆ భయం పళనిస్వామికి ఉంది. అటు పన్నీర్ సెల్వం కూడా తనకు గుర్తింపులేదని రగిలిపోతున్నారు. ఇక బీజేపీ ఈసారి 60 సీట్లకు స్కెచ్ గీస్తోంది. అన్ని లెక్కలున్నవేళ, పొంగల్ తర్వాత శశికళ జైలు నుంచి బయటకు వస్తున్నారు. ఎన్నికల ముందు- శశికళ భవిష్యత్తు, అన్నాడీఎంకే భవిష్యత్- అంధకారంగా కనిపిస్తోంది. అందుకే చిన్నమ్మ వేసే స్కెచ్ ఏంటన్నది ఇడ్లీసాంబార్ పాలిటిక్స్‌లో అసలుపాయింట్.