తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రెండ్రోజుల పర్యటన పొలిటికల్ సర్కిల్‌లో కాక పుట్టిస్తోంది. ఓరుగల్లు వేదికగా సీఎం కేసీఆర్‌పై రాహుల్ చేసిన కామెంట్లు మంటలు రేపుతున్నాయ్. టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒకటేనన్న రాహుల్ వ్యాఖ్యలు పెనుదుమారమే లేపాయి. మీరిద్దరూ తోడుదొంగలంటే.. కాదు మీరిద్దరే తోడు దొంగలంటూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. ఓరుగల్లు సభలో సీఎం కేసీఆర్‌ను రాజుతో పోలుస్తూ రాహుల్ కామెంట్ చేయడంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు పోతుంటారంటూ ట్విటర్‌లో వ్యంగాస్త్రాలు విసిరారు. కేటీఆర్ వ్యాఖ్యలను అంతే దీటుగా తిప్పికొడుతున్నారు కాంగ్రెస్ నేతలు. రాహుల్‌ను పొలిటికల్ టూరిస్టు అనడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ గతంలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిషా, మహరాష్ట్రలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన టూర్‌ను ఏమనాలో చెప్పాలంటూ కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
ఓరుగల్లు సభలో రాహుల్ డిక్లరేషన్‌పై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేటలో టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో రాహుల్ వ్యాఖ్యలపై వ్యంగాస్త్రాలు సంధించారు. ఆయన ఏ హోదాలో డిక్లరేషన్ ఇచ్చారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ ఏఐసీసీ అధ్యక్షుడు కాదు, ప్రధాని కాదు.. అయినా ఏ హోదాలో డిక్లరేషన్ ఇచ్చారో తెలయడం లేదన్నారు.
టీఆర్‌ఎస్ నేతల విమర్శలపై కన్నెర్రజేశారు టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి. రాహుల్ ఏ హోదాలో డిక్లరేషన్ ఇచ్చారన్న ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని హోదాలో డిక్లరేషన్ ఇచ్చారని స్పష్టంచేశారు.
మొత్తానికి రాష్ట్రంలో రాహుల్ గాంధీ రేపిన ప్రకంపనలకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేలా లేదు. తెలంగాణలో ఎన్నికలకు ఏడాది ముందే పరస్పర విమర్శలతో హీటెక్కిస్తున్న రాజకీయాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరిన్ని రాజకీయ వార్తల కోసం..
ఇవి కూడా చదవండి: Taj Mahal: తాజ్‌మహల్‌లోని ఆ గదులను తెరవండి.. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్..
Kitchen Tips: టేస్టీ టేస్టీ పాస్తా కట్‌లెట్.. మీ ఇంట్లోని చిన్నారులకు అదిరిపోయే టిఫిన్ ఇలా చేయండి..