
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. మూడు ప్రధాన పార్టీలూ బరిలో వున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉన్న ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ పక్కా వ్యూహంతో వెళుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తలసాని సాయికిరణ్ పోటీలో ఉన్నారు. గతంలో రెండుసార్లు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అభ్యర్ధి ఎం.అంజన్‌కుమార్ యాదవ్ కూడా గట్టి ప్రయత్నాల్లోనే వున్నారు. బీజేపీ సిటింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయను కాదని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని రంగంలోకి దింపింది. దీంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు ప్రస్తుతం టీఆర్‌ఎస్ ఖాతాలో ఉండగా, నాంపల్లి నుంచి టీఆర్‌ఎస్ మిత్రపక్షం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తోంది. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మైనారిటీలు, బీసీలు అధిక సంఖ్యలో ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.