Kangana Ranaut: తలైవి జయలలిత బాటలో రాజకీయాల్లోకి వస్తారా?.. కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Sep 12, 2021 | 9:21 PM

Thalaivi - Kangana Ranaut: జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. తన నటనకు అమ్మ(జయలలిత) అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తల నుంచి మంచి మార్కులే సాధించారు.

Kangana Ranaut: తలైవి జయలలిత బాటలో రాజకీయాల్లోకి వస్తారా?.. కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Kangana and Jayalalitha
Follow us on

Thalaivi Actress Kangana Ranaut: జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. తన నటనకు అమ్మ(జయలలిత) అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తల నుంచి మంచి మార్కులే సాధించారు. పురట్చి తలైవి(విప్లవ నాయకి), అమ్మగా కోట్లాది మంది తమిళుల గుండెల్లో గుడి కట్టుకున్న జయలలిత.. ముందుగా సినీ నటిగా గుర్తింపు సాధించి, ఆ తర్వాత ఎంజీఆర్ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేశారు. అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లోనూ తన సత్తాను చాటారు. నేరుగా విషయానికొస్తే జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించిన కంగనా రనౌత్ కూడా బాలీవుడ్ అగ్ర నటీమణుల్లో ఒకరుగా వెలుగొందుతున్నారు. ఆమెకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన ఉందంటూ గతంలో కథనాలు వెలువడ్డాయి. బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ కథనాల్లో వాస్తవంలేదంటూ ఎప్పటికప్పుడు ఆమె క్లారిటీ ఇచ్చారు.

తలైవి సినిమా విడుదలైన నేపథ్యంలో కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ ప్రవేశంపై కంగనా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దేశభక్తి ఎక్కువేనని చెప్పిన బాలీవుడ్ నటి.. అయితే ఇప్పటికిప్పుడు రాజకీయాల్లో ప్రవేశించే ఆలోచన తనకు లేదని స్పష్టంచేశారు. గ్రౌండ్ లెవల్‌లో పనిచేయకుండా ఒకరు గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కూడా విజయం సాధించలేరన్న విషయం తనకు తెలుసని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రాకముందు ప్రజల మద్దతు పొందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు కోరుకుంటే రాజకీయ ప్రవేశంపై తాను ఆలోచన చేస్తానని స్పష్టంచేశారు. తలైవి జయలలిత భౌతికంగా దూరమై చాలా రోజులైనా ప్రజలు ఆమెను ఇప్పటికీ గుండెల్లో పెట్టుకున్నారని కొనియాడారు. రేడియో జాకీ రనౌక్ నిర్వహించిన ఓ యూట్యూబ్ షో కార్యక్రమంలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ భక్తితో మాట్లాడినందుకు తాను తగిన మూల్యం చెల్లించుకున్నట్లు కంగనా వ్యాఖ్యానించారు. దేశ నిర్మాణంపై నిర్భయంగా, ముక్కుసూటిగా మాట్లాడినందుకు తాను చాలా ప్రాజెక్టులో కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తద్వారా ఆర్థికంగానూ చాలా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అయితే డబ్బుకంటే తనకు దేశమే ముఖ్యమన్నారు. ఈ విషయంలో తన జీవితంలో ఒకే వైఖరితో ముందుకు వెళ్తానని.. ద్వంద్వ వైఖరి ఉండబోదన్నారు.

Also Read..

గురువాయూర్ ఆలయంలో మోహన్ లాల్‌కు స్పెషల్ ట్రీట్మెంట్ వివాదం.. ఇంతకీ ఏం జరిగిందంటే?

సినీ ఫిల్డ్‌లో మాత్రమే కాదు.. అన్ని చోట్లా ‘డ్రగ్స్ దందా’ ఉంది.. సుమన్ సెన్సేషనల్ కామెంట్స్