TELANGANA POLITICS HEATING UP BJP CONGRESS READY FOR KCR CHALLENGE: ఎవరి వ్యూహాలు వారివి.. ఎవరి ఎత్తుగడలు వారివి.. వెరసి తెలంగాణ ఎన్నికలవేడిని క్రమంగా సంతరించుకుంటోంది. గత ఆరునెలలుగా రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలొస్తాయన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దానికి అనుగుణంగానే పాలక, ప్రతిపక్షాలు తమ కార్యకలాపాలను వేగవంతం చేశాయి. ఫామ్ హౌజ్, ప్రగతి భవన్(Pragathi Bhavan) వేదికలుగా అధికార టీఆర్ఎస్ పార్టీ(TRS Party) వ్యూహరచన కొనసాగుతుండగా.. తెలంగాణ కాంగ్రెస్(T Congress), బీజేపీలు తమ అధిష్టానాల కనుసన్నల్లో ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. గత రెండు నెలలుగా రాష్ట్రంలో పార్టీల పాదయాత్రలు, సభలు ఎక్కువయ్యాయి. మే నెలలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాక తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాహుల్ మార్గదర్శకత్వంలో ఆ పార్టీ నేతలు జనం మధ్య తిరిగేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరిట టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) రెండు దఫాలుగా పాదయాత్రలు నిర్వహించారు. రెండో విడత పాదయాత్ర గద్వాల జిల్లా జోగులాంబ సన్నిధి నుంచి మొదలుపెట్టి రాజధాని హైదరాబాద్(Hyderabad) శివారులోని తుక్కుగూడ వద్ద భారీ బహిరంగ సభతో ముగించారు. ఈ పాదయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్ వద్ద నిర్వహించిన సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నడ్డా(JP Nadda) హాజరయ్యారు. పాదయాత్ర ముగింపులో తుక్కుగూడ వద్ద నిర్వహించిన సభలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా(Amit Shah) పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు మే చివరి వారంలో హైదరాబాద్ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) బేగంపేట ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. అదే ఊపును కొనసాగిస్తూ హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్లాన్ చేసింది. హెచ్ఐసీసీ నోవాటెల్ ప్రాంగణంలో జులై 2, 3 తేదీలలో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరిగాయి. రెండోరోజు అంటే జులై 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగసభను నిర్వహించింది. బీజేపీ నేతలంతా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. కానీ ప్రధాన మంత్రి మాత్రం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది.. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు దోహదపడింది అన్న అంశాలను వివరించారు. సభకు తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలను చూసి మోదీ ఉప్పొంగిపోయారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని అభినందించారు. పరేడ్ గ్రౌండ్స్ సభ తర్వాత తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు మరింత తీవ్రమయ్యాయి.
ఈక్రమంలో జులై 10వ తేదీన ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కే.చంద్రశేఖర్ రావు (K Chandrashekhar Rao) ప్రగతిభవన్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశం రాష్ట్ర రాజకీయ ప్రకంపనలను పీక్ లెవెల్‌కి చేర్చింది. రెండున్నర గంటల పాటు మీడియా మీట్‌లో మాట్లాడిన కేసీఆర్.. నేరుగా నరేంద్ర మోదీ (Narendra Modi)పైనే విరుచుకుపడ్డారు. మోదీ అంతటి అసమర్థ ప్రధానిని చూడలేదన్నారు. బీజేపీని ప్యాక్ చేసి ఇంటికి పంపాల్సిన తరుణం వచ్చిందన్నారు. 8 ఏళ్ళ మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు జాతీయ పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నానన్నారు. కేసీఆర్ (KCR) కామెంట్లపై బీజేపీ నేతలు బండి సంజయ్, డా.కే.లక్ష్మణ్ (Dr K Laxman), డీ.కే. అరుణ (DK Aruna) తీవ్ర స్థాయిలో ఎదురు దాడికి దిగారు. వివిధ అంశాలపై మాటల యుద్దం ఎలా వున్నా.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అంటే రెడీ అనుకోవడమే ఆసక్తిని రెట్టింపు చేసింది. ‘‘తేదీలు మీరు చెప్పండి.. నేను అసెంబ్లీ రద్దుకు రెడీ’’ అని కేసీఆర్ విసిరిన ఛాలెంజ్‌కు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీ నేతలు సై అంటే సై అన్నారు. అయితే.. ‘‘తేదీలు మేం చెప్పడమేంటి? మీరు అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికలెప్పుడు నిర్వహించాలో కేంద్ర ఎన్నికల సంఘమే తేలుస్తుంది కదా ’’ అంటూ బీజేపీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో ప్రకటనలకు దిగారు. అదేసమయంలో కేసీఆర్‌ను గద్దెదింపి, ఇంటికి పంపేందుకు తెలంగాణ జనం సిద్దంగా వున్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలంటున్నారు. తాజాగా అసెంబ్లీ రద్దుకు రెడీ అన్న ముఖ్యమంత్రి కామెంట్..కాక రేపుతోంది. ప్రతిపక్షాలు రెడీ అంటే ఎప్పుడైనా రద్దుకు రెడీ అన్నట్లుగా మాట్లాడారు కేసీఆర్. అయితే, ఈ ఏడాది ఆఖరులో గుజరాత్ (Gujrat), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రాలకు ఎన్నికలకు జరగబోతున్నాయి. ప్రస్తుతం బీజేపీ అధిష్టానం గుజరాత్ స్టేట్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. నరేంద్ర మోదీ సైతం వారానికోసారి గుజరాత్ వెళ్ళి వస్తున్నారు. జులై 4వ తేదీన భీమవరం (Bhimavaram) సభ తర్వాత మోదీ నేరుగా గుజరాత్ వెళ్ళారు. గుజరాత్‌లో బీజేపీ విజయం పార్టీకే కాదు.. మోదీ, అమిత్ షాలకు కూడా ప్రతిష్టాత్మకమే. ఈక్రమంలో వచ్చే రెండు, మూడు నెలలు బీజేపీ అధిష్టానం గుజరాత్‌పైనే ఎక్కువ దృష్టి సారించనున్నది. అయితే బీజేపీ అధిష్టానం దృష్టి గుజరాత్‌పై కొనసాగుతున్న తరుణంలోనే తెలంగాణలో ఎన్నికలు జరిగేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇపుడు అసెంబ్లీని రద్దు చేస్తే గుజరాత్ అసెంబ్లీతోపాటు తెలంగాణ అసెంబ్లీకు ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్ రాష్ట్రంలో గత 22 ఏళ్ళుగా బీజేపీ గెలుస్తూ వస్తోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పాగా పుంజుకోకుండా చూడడం బీజేపీ అధిష్టానానికి అత్యంత ముఖ్యం. కాబట్టి తెలంగాణ, గుజరాత్‌లలో ఒకేసారి ఎన్నికలు జరిగితే.. బీజేపీ ఫోకస్ గుజరాత్‌పైనే ఎక్కువగా వుండే అవకాశం వుంది. అప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలు పెరుగుతాయి. అందుకే వ్యూహాత్మకంగా ఇపుడే అసెంబ్లీ రద్దు అంశాన్ని కేసీఆర్ తెరమీదికి తెచ్చి వుంటారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ రద్దు చేయడం ఇంకాస్త జాప్యం చేస్తే వచ్చే ఏడు తొలి భాగంలో మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికలొస్తాయి. దాంతో గుజరాత్‌తోపాటే ఇక్కడ ఎన్నికలు జరగడం తమకు లాభదాయకమన్న అభిప్రాయంతో కేసీఆర్ వున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణం చూస్తుంటే ఎన్నికలు షెడ్యూల్ కన్నా ముందే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తే 2023 ఆగస్టు-నవంబర్ మధ్య కాలంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ ముందస్తు ఎన్నికల సంకేతాలు గత ఆరు నెలలుగా వస్తున్నాయి. కేసీఆర్ కదలికలను సునిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే పాదయాత్రలతోపాటు.. ప్రభుత్వ వ్యతిరేక కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ సమస్యలపై పోరాడుతూ వెళ్తోంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బండి సంజయ్ టీం పాదయాత్రలు చేస్తోంది. ఇటీవల కరెంటు బిల్లుల పెంపుపై కాంగ్రెస్ ధర్నాలు చేసింది. రైతు పంట కొనుగోలుపై బీజేపీ బహిరంగ సభలు పెట్టింది. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో బండి ప్రజల్లోకి వెళ్తుంటే.. రాహుల్‌ని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్‌తో సెగ రగిల్చింది తెలంగాణ కాంగ్రెస్. ఆ మధ్య కేసీఆర్ ముందస్తుపై క్లారిటీ కూడా ఇచ్చారు. వందశాతం ముందస్తుకు పోయేదే లేదన్నారు సీఎం. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు చూస్తున్నారు. రైతు పంట కొనుగోలుపై ఢిల్లీలో ప్రజాప్రతినిధులతో భారీ సభ నిర్వహించారు. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఆస్పత్రులకు శంకుస్థాపనలతో దూసుకెళ్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ముందస్తుపై సీఎం కేసీఆర్ జులై పదిన చాలెంజ్ విసరడం పొలిటికల్ వెదర్‌ను వేడెక్కిచింది. గతంలో అమిత్‌షా కూడా ముందస్తుపై మాట్లాడారు. కేసీఆర్ ముందస్తుకు కాదు.. ఇప్పటికిపుడు ప్రభుత్వాన్ని రద్దుచేసి రావాలని సవాల్ విసిరారు. అమిత్‌షా సవాల్‌ను మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. ముందస్తుకు వెళ్లాల్సిన ఖర్మ మాకు పట్టలేదన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీకి అంత ఉబలాటంగా ఉంటే.. పార్లమెంటును రద్దుచేసుకుని ఎన్నికలకు వెళ్లాలన్నారు. కానీ ఇపుడు కేసీఆరే స్వయంగా అసెంబ్లీ రద్దుకు రెడీ అన్నారు. మరోవైపు బీజేపీ డబుల్ డెక్కర్ నినాదంపైనా హీటెడ్ డిబేట్ జరుగుతోంది. ఉత్తరాదిలో డబుల్ ఇంజన్ పేరుతో ప్రచారం చేసిన షా.. ఇక్కడ డబుల్ డెక్కర్ నినాదం ఎత్తుకున్నారు. అయితే డబుల్ ఇంజన్ సర్కారున్న అన్ని బీజేపీ రాష్ట్రాల్లోనూ అభివృద్ధి ఎలా ఉందో చూస్తూనే ఉన్నామంటూ.. కౌంటరిచ్చారు కేటీఆర్. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో మంచి జోష్‌మీదున్న బీజేపీ ఫోకస్ అంతా ఇప్పుడు తెలంగాణపైనే నెలకొంది. బీజేపీ హైకమాండ్ ఆదేశాల ప్రకారం..రాష్ట్ర కమలదళం ముందస్తుకు సిద్ధమవుతోంది. ఏకంగా 70 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మిషన్ 70 పేరిట బీజేపీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ముందస్తు మంటలు మొదలయ్యాయి. దమ్ముంటే ముందస్తుకు రావాలంటూ కేసీఆర్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మేం రెఢీ అంటూ ముందుకొచ్చాయి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్. దీనిపై అధికార పక్షం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. సై అంటే సై అంటున్న ప్రత్యర్థుల మాటలను పరిగణనలోకి తీసుకుంటే అసెంబ్లీ రద్దుకు రంగం సిద్దమైనట్లుగానే భావించాల్సి వుంది.