పంజాబ్ కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయి. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య అంతరం రానురానూ పెరుగుతోంది. ముఖ్యమంత్రి గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి సిద్ధూ గైర్హాజరవవ్వడమే ఇందుకు నిదర్శనం. గురువారం నాటి కేబినెట్ సమావేశానికి గైర్జాజరైన సిద్ధూ.. విలేకర్ల సమావేశం నిర్వహించి సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమికి తానొక్కడినే బాధ్యుడిని చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపైనా, ఓటమైనా అందరూ బాధ్యత వహించాలన్నారు. కొందరు కక్షగట్టి తనపై నిందలు మోపుతున్నారని, పార్టీ నుంచి తొలగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. అర్బన్ ప్రాంతాల్లో పార్టీ ఓటమి చవిచూసిందన్న అమరీందర్ వ్యాఖ్యలనూ సిద్ధూ తప్పుబట్టారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో సిద్ధూ సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధూకు అమరీందర్.. టికెట్ నిరారించడంతో వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమైంది. మరోవైపు సిద్ధూ మంత్రిత్వశాఖను సైతం మార్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.